హరీష్ రావు, రాజమౌళి.. భలే పొగిడేసుకున్నారుగా
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, తెలంగాణ మినిస్టర్ హరీష్ రావు ఒక కార్యక్రమం కోసం ఒకే వేదికపై స్టేజ్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరి గురించి మరొకరు ప్రశంసించుకుంటూ చాలా గొప్ప స్పీచ్‌లే ఇచ్చారు. బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ ఓపెనింగ్ కు హాజరయ్యారు రాజమౌళి, హరీష్ రావు.
కార్యక్రమంలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ, ఓ సారి తాను హైదరాబాద్ నుంచి నాగపూర్ కు రోడ్ మార్గంలో వెళ్లేటప్పుడు హరీష్ రావు నియోజకవర్గం మీదుగా వెళ్లినట్లు తెలిపాడు. ముందున్న నియోజకవర్గానికి, ఆ నియోజక వర్గానికి చాలా స్పష్టమైన మార్పు కనిపించిందని, అప్పట్నుంచే హరీష్ రావు కు తాను పెద్ద ఫ్యాన్ అయినట్లు చెప్పుకొచ్చాడు.
రాజమౌళి మాట్లాడిన తర్వాత హరీష్ రావు కూడా రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ లను తెగ పొగిడేశారు. రాజమౌళి ఎంతో గొప్ప డైరెక్టర్ అని, ఆయన సినిమాలకు తాను ఫ్యాన్ అని హరీష్ చెప్పారు. జాతీయ భావంతో ఉంటూనే సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవుతాయని, ఆయన సినిమాలో అంతర్లీనంగా మంచి విషయాలుంటాయని హరీష్ రావు ప్రశంసించారు.
అంతేకాదు, రాజమౌళి తండ్రిని తాను ఎన్నో సార్లు కలిసినట్లు చెప్పుకొచ్చారు హరీష్ రావు. ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారని, తాము స్టార్ట్ చేసిన ఓ హాస్పిటల్ బాధ్యతను విజయేంద్ర ప్రసాద్ తీసుకుని అందులో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారని, తన తండ్రిలాగే రాజమౌళి కూడా సేవా కార్యక్రమాలు బాగా చేస్తుంటారని రాజమౌళి, అతని తండ్రిని ఆకాశానికెత్తేశారు మినిస్టర్ హరీష్ రావు.













