మరోసారి త్రివిక్రమ్ సినిమాలో బ్రహ్మానందం
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లలో ఒకటి త్రివిక్రమ్-బ్రహ్మానందం. అతడు సినిమా నుంచి వీరిద్దరి కాంబోకి మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఆ సినిమాలోని మీమ్స్ ను వాడుతున్నారంటే అది ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
జల్సాలో కానిస్టేబుల్ ప్రణవ్ని మరో రెండు దశాబ్దాల వరకు మర్చిపోలేం కూడా. అవే కాదు ఖలేజా, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా బ్రహ్మీకి మంచి కామెడీ క్యారెక్టర్లే ఇచ్చాడు త్రివిక్రమ్. కానీ తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. రీసెంట్గా తన సినిమాల్లో బ్రహ్మీకి క్యారెక్టర్ రాయలేదు త్రివిక్రమ్. అల వైకుంఠపురములో సినిమాలో జస్ట్ ఓ ఫ్రేమ్ లో మెరిసి వెళ్లిపోయాడు తప్పించి ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ అయితే ఇవ్వలేదు.
ఇప్పుడు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో బ్రహ్మానందం నటించబోతున్నాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ కి మార్పులు చేసే టైమ్ లో మహేష్ కోరిక మేరకు బ్రహ్మానందం క్యారెక్టర్ ని త్రివిక్రమ్ రాసినట్లు సమాచారం. ఎలాగైతేనేం ఇది మంచి గుడ్ న్యూస్. 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పలు వాయిదాలు పడ్డప్పటికీ ఇకపై నాన్ స్టాప్ గా షూటింగ్ జరపనున్నట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.













