రాజకీయాల్లోకి రాబోతున్న మరో హీరో…
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆసక్తి రేపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దేశంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ముందు వెళ్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ తరుణంలో సినిమా స్టార్స్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
కన్నడ హీరో ఉపేంద్ర ఇప్పటికే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. చాలా ఒడిదుడుకుల తర్వాత ఆ పార్టీ నుండి బయటకి వచ్చాడు. ప్రస్తుతం మరో కన్నడ స్టార్ హీరో “కిచ్చా సుదీప్” ను సోమవారం ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ కలిశారు. ఈ నేపథ్యంలో సుదీప్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. జేడీఎస్ అధినేత గతంలో సుదీప్ ని తమ పార్టీలోకి ఆహ్వానించారు, కానీ ఆ ఆఫర్ పై సుదీప్ అప్పట్లో అంతగా రెస్పాండ్ అవ్వలేదు.
తన పొలిటికల్ ఎంట్రీ గురించి రీసెంట్ గా మీడియా ప్రశ్నించగా, ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది స్నేహపూర్వక భేటీ అని తెలుస్తుంది. ఈ భేటీ సందర్భంగా కర్ణాటక రాజకీయాలపై సుదీప్ తో దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగినట్టు సమాచారం. నటుడు సుదీప్ కాంగ్రెస్ లో చేరాలని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పార్టీ మాజీ ఎంపీ రమ్య స్వయంగా సుదీప్ తో సంప్రదింపులు జరిపారు. సుదీప్ ఈ విషయంపై ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













