Kangana Ranaut: బాలీవుడ్ హీరోలకు మర్యాద తెలియదు
మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తూ ముక్కుసూటి తనంతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్(kangana ranaut). ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కంగనా తాను పడిన కష్టాల గురించి మాట్లాడింది. ఇంటర్వ్యూలో కంగనా బాలీవుడ్ హీరోలకు మర్యాద లేదని, ఇండస్ట్రీ మొత్తం మురికి పట్టిందని చెప్పింది.
ఇండస్ట్రీలో ఉండేవారికి బయటి నుంచి వచ్చిన వారిపై కనీస దయ కూడా ఉండదని, ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడానికి అవుట్‌సైడర్ గా తాను పడిన కష్టాలు చాలానే అని కంగనా చెప్పింది. ఇండస్ట్రీలోని చాలా మంది మేల్ యాక్టర్స్ ను మర్యాద తెలియని వాళ్లని చెప్పిన కంగనా, తానెప్పుడూ వాళ్లను పట్టించుకోలేదని చెప్పింది. తాను ఎక్కువ మంది హీరోలతో కలిసి వర్క్ చేయలేదని, దానికి కారణం వాళ్లు మర్యాదగా ఉండకపోవడం కూడా ఒకటి పేర్కొంది.
కేవలం లైంగికంగా మాత్రమే కాకుండా, సెట్స్ కు లేట్ గా రావడం, తనను పక్కన పెట్టడం, చిన్న కారావ్యాన్ ఇచ్చి చిన్నచూపు చూడటం లాంటివి ఎన్నో ఎదుర్కొన్నానని, ఈ విషయాలన్నింటిపై మాట్లాడినందుకు ఎంతోమంది తనపై కేసులు కూడా పెట్టారని కంగనా చెప్పింది. కాస్టింగ్ కౌచ్ వల్ల ఇండస్ట్రీలోని చాలా మంది మహిళా నటులు ఇబ్బంది పడుతున్నారని కంగనా మరోసారి స్పష్టం చేసింది.







