Kamal Haasan: కన్నడ భాష వివాదంలో కమల్ హాసన్…! థగ్ లైఫ్ విడుదలపై సంచలన నిర్ణయం

సినీ నటుడు, నిర్మాత కమల్ హాసన్ (Kamal Hassan) తాజాగా కన్నడ భాషపై (Kannada) చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో (Karnataka) తీవ్ర వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ (Thug Life) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగులకు ఆగ్రహం తెప్పించాయి. కమల్ వ్యాఖ్యలను కన్నడ భాషా సంఘాలు, రాజకీయ నాయకులు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని KFCC అల్టిమేటం జారీ చేసింది. అయితే కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకూడదని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌ను (Sivaraj Kumar) ఉద్దేశిస్తూ.. కన్నడ భాష తమిళం (Tamil) నుంచే పుట్టిందని కమల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కన్నడిగులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. కన్నడ భాషకు సుమారు 4వేల ఏళ్ల చరిత్ర ఉందని, ఇది తమిళం నుంచి ఉద్భవించిన భాష కాదని కన్నడ అభిమానులు, సాంస్కృతిక సంఘాలు వాదించాయి. బెంగళూరు, మైసూరు, హుబ్బళ్లి వంటి నగరాల్లో నిరసనలు చెలరేగాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించింది. కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను రాష్ట్రంలో నిషేధిస్తామని హెచ్చరించింది. “మా భాష, భూమి, నీటి విషయంలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సహించబోము” అని KFCC అధ్యక్షుడు ఎం.నరసింహులు స్పష్టం చేశారు.
అయితే కమల్ హాసన్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. “నేను ప్రేమతో చెప్పిన మాటలను అపార్థం చేసుకున్నారు. భాషల గురించి చర్చించే అర్హత నాకు లేదు, ఈ విషయాన్ని చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేస్తున్నాను” అని వివరణ ఇచ్చారు. అయితే బహిరంగ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. “తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతాను.. నేను తప్పు చేయలేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం మరింత ముదిరింది.
థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కావాల్సి ఉంది. కర్ణాటకలో నిషేధ బెదిరింపులు రావడంతో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదలకు ఆటంకం కలిగించకుండా, తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖను ఆదేశించాలని కోరారు. అయితే.. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సారీతో పోయే దానికి ఇంతవరకూ తెచ్చుకున్నారని కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సి.రాజగోపాలాచారి కూడా ఇలాగే మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పారని గుర్తు చేసింది. అయితే… కమల్ న్యాయవాది మాత్రం అందుకు నిరాకరించారు. “కమల్ తాను చెప్పాలనుకున్నది చెప్పారని.. పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంటే.. థగ్ లైఫ్ ను కర్ణాటకలో విడుదల చేయరని’ కోర్టుకు వివరించారు. కన్నడిగులు తమ భాషా గౌరవాన్ని కాపాడుకోవడంలో దృఢంగా ఉండగా, కమల్ కూడా తన వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఈ వివాదం థగ్ లైఫ్ బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కర్ణాటక హైకోర్టు ఈ అంశంపై జూన్ 10న తదుపరి విచారణ జరపనుంది.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘థగ్ లైఫ్’ ఒక హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. కమల్ హాసన్‌తో పాటు శింబు, త్రిష, అభిరామి, నాజర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో జూన్ 5న విడుదల కానుంది. అయితే, కర్ణాటకలో వివాదం కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయే అవకాశం ఉంది.