కళ్యాణ్ కృష్ణపై పెద్ద భారం
రీసెంట్గా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ దిశగా దారి తీస్తుంది. రిజల్ట్ గురించి అసలు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారనే విషయం చిరంజీవి వరకు వెళ్తుందో లేదో కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం చిరూ సినిమాల పట్ల చాలా నిరాశ చెందుతున్నారు.
మెగాస్టార్ చుట్టూ ఉన్న బ్యాచ్ చేసే భజన వల్ల ఆ మాటలను మెగాస్టార్ ఓవర్ గా నమ్మేసి సినిమాలు చేయడంతో నిర్మాతలు నష్టపోవడంతో పాటూ తన కెరీర్ కు కూడా బాగా నష్టం జరుగుతుంది. అంతేకాదు ఫ్యాన్స్ కూడా చాలా బాధ పడుతూ తమ బాధను సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగాస్టార్ చేయబోయే తర్వాత సినిమాపై భారం మరింత పెరిగింది.
ఇప్పుడు ఈ భారమంతా ఆ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మీద పడింది. ఆ మూవీ అనౌన్స్మెంట్ కూడా ఈ నెలలోనే రానున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణపై ఇంత భారమున్నప్పటికీ తనకేమీ గొప్ప ట్రాక్ రికార్డ్ లేదు. ఇప్పటివరకు సోగ్గాడే చిన్ని నాయన సినిమా హిట్ తోనే కెరీర్ ను లాక్కొస్తున్నాడు. బంగార్రాజు కమర్షియల్ గా వర్కవుట్ అయింది కానీ సోగ్గాడే రేంజ్ హిట్ అయితే కాదు, చైతూతో చేసిన రారండోయ్ వేడుక చూద్దాం హిట్ అయినా, రవితేజతో చేసిన నేల టికెట్టు డిజాస్టర్ గా మిగిలింది.
ఇలాంటి ట్రాక్ రికార్డున్న కళ్యాణ్ కృష్ణకు మెగాస్టార్ ఇప్పుడు ఆఫర్ ఇచ్చాడు. దానికి తోడు ఈ సినిమా మలయాళ సినిమా బ్రో డాడీ కి రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. ఆ స్టోరీ కూడా తెలుగు ఆడియన్స్ కు ఏ మాత్రం ఎక్కేలా ఉండదని అంటున్నారు. అలాంటి సబ్జెక్ట్ తో చిరూ సినిమా చేయడమంటే రిస్క్ అనే చెప్పాలి. మరి ఇంతటి భారాన్ని కళ్యాణ్ కృష్ణ ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది చూడాలి.













