అయోమయంలో పడ్డ కళ్యాణ్ కృష్ణ
తెలుగు ఆడియన్స్ కు కళ్యాణ్ కృష్ణ అనే డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోగ్గాడే చిన్నినాయనా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో డైరెక్టర్ గా పరిచమైన కళ్యాణ్ కృష్ణ తన రెండో సినిమాగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేసి మెప్పించాడు. ఆ తర్వాత రవితేజ తో చేసిన నేల టిక్కెట్లు సినిమా తేడా కొట్టినా బంగార్రాజు సినిమాతో ఫర్వాలేదనిపించుకున్నాడు.
కెరీర్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ కృష్ణది మంచి ట్రాక్ రికార్డనే చెప్పాలి. ఆ ట్రాక్ రికార్డు తోనే చిరూతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. బ్రో డాడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లు రీమేక్ చేసే బాధ్యతను చిరూ, కళ్యాణ్ కృష్ణకు అప్పగించాడు. కానీ భోళా శంకర్ సినిమా ఫలితం తర్వాత చిరూ తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ సినిమాను పక్కకు పెట్టాడు.
మొదట్లో మళ్లీ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారన్నారు కానీ ఇప్పుడు మొత్తానికి ఆ సినిమా అటకెక్కిందని, చిరూ ప్రస్తుతం వశిష్ఠతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. వచ్చినట్లే వచ్చి చిరూ సినిమా క్యాన్సిల్ అవడంతో ప్రస్తుతం కళ్యాణ్ కు ఏం చేయాలో తోచడం లేదు. చిరూతో ఈ సినిమా చేసుంటే రిజల్ట్ తో సంబంధం లేకుండా తన కెరీర్ కు ఉపయోగపడేది కానీ ఈ సినిమా ఆగిపోవడంతో ఇప్పుడు తన పరిస్థితితేంటా అని తెగ బాధ పడుతున్నాడట.













