సాహసాలు చేయనంటోన్న చందమామ
పెళ్లయ్యాక కొన్నాళ్ల పాటూ సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోల పక్కన కాజల్ పర్ఫెక్ట్ ఛాయిస్ గా కనిపిస్తుండటంతో వారు కూడా అమ్మడికే ఓటేస్తున్నారు. ఓ వైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది కాజల్.
పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా ఇలా ఛాన్సులందుకోవడమంటే మాటలు కాదు. కానీ కాజల్ మాత్రం ఇంతకుముందులా సినిమాలు చేయలేనంటోంది. తనకు వరుస అవకాశాలొచ్చినప్పటికీ అందులో సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకోవాల్సి వస్తోందని, రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం రెడీగా లేనని, దానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని చెప్పుకొచ్చింది కాజల్.
నీల్ పుట్టాక సినిమా, వ్యక్తిగత జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందని, కుటుంబ బాధ్యతలతో పాటూ కంటికి రెప్పలా కాపాడుకునే బాబు కూడా ఉండటంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని, అందుకే ఆన్ సెట్స్ లో ఎలాంటి సీన్స్ అయినా చేయడానికి రెడీగా లేనని చెప్తోంది కాజల్. అందుకే కాజల్ సాహసాలకు వీలైనంత దూరంగా ఉంటుందట. అంటే ఇక ముందు కాజల్ నుంచి సాహసోపేతమైన కథలు, సీన్స్ రావనే విషయం అర్థమైపోయింది. అంతేకాదు వీలైనంత వరకు కంఫర్ట్ జోన్ లోనే సినిమాలు చేస్తా అని కూడా చెప్తోంది కాజల్.













