రెండు సీక్వెల్స్ చేసేందుకు రెడీ అవుతున్న దర్శకేంద్రుడు.. ఒక సినిమాలో చరణ్ హీరో?
ఒక సినిమా సూపర్‌హిట్ అయితే దానికి సీక్వెల్‌ను రూపొందించే ఈమధ్యకాలంలో ఎక్కువైంది. ఒకప్పుడు సీక్వెల్ అనే మాటే వినపడేది కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలతో సినిమా చేస్తూ సీక్వెల్ అనే మాటే మాట్లాడుకునేవారు కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు. కొత్త కథతో ప్రయోగాలు చేసే కంటే ఆల్రెడీ సూపర్‌హిట్ అయిన కాన్సెప్ట్‌కే కొనసాగింపుగా సినిమా చేయడం ఈజీ కదా. అందుకే సీక్వెల్స్ అంటే చాలా మంది డైరెక్టర్లు మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు భాషల్లో సీక్వెల్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు కూడా సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు. జగదేకవీరుడు అతిలోక సుందరి సూపర్‌హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది కూడా చిరంజీవితోనే చెయ్యాలనేది ఆయన ఆలోచన. కానీ, ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. తాజాగా ఈ సీక్వెల్‌ను రామ్‌చరణ్‌తో చేయబోతున్నారనే వార్త వినిపస్తోంది. దీనికోసం ఎప్పుడో కథ రెడీ చేసి పెట్టుకున్న దర్శకేంద్రుడు ఇటీవల ఆ కథను చిరంజీవికి వినిపించడం, ఆయన కూడా ఓకే అనడంతో జగదేకవీరుడు.. సీక్వెల్‌కి రంగం సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కంటే ముందు పెళ్లిసందడి సీక్వెల్‌ను ప్రారంభించేందుకు రాఘవేంద్రరావు సిద్ధమవుతున్నారు. ఈ సీక్వెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ పూర్తయిన తర్వాతే జగదేకవీరుడు.. సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకెళతారని సమాచారం.













