వివాదంలో రజినీ మూవీ టైటిల్
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా జైలర్. వచ్చే నెల 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ వివాదం చుట్టుముట్టింది. కేరళకు చెందిన సక్కిర మదత్తిల్ ఈ టైటిల్ ను 2021లోనే ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారని, గడువు అయ్యాక రెన్యువల్ కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
గతంలో ఈ సినిమా టైటిల్ లాంఛ్ దుబాయ్ లో జరగ్గా ఆ ఈవెంట్ కు కమల్ హాసన్ కూడా గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమాను కూడా ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాత సక్కిర మదత్తిల్ ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు తమ టైటిల్ను రజినీకాంత్ సినిమాకు వాడుకోవడంపై ఈ వ్యవహారం మద్రాస్ కోర్టుకు చేరింది. ఆగస్ట్ 2న ఈ విషయంపై తీర్పు వెలవడనున్నట్లు సమాచారం.
రజినీ నిర్మాతలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే రజినీ జైలర్ కూడా మలయాళం, తమిళంలో రిలీజ్ అవుతుంది. ఒకే సినిమాకు రెండు వేర్వేరు టైటిల్స్ పెట్టి రిలీజ్ చేస్తే ఆడియన్స్ గందరగోళానికి గురవడం తప్పించి మరొకటి ఉండదు. అందుకే ఈ వ్యవహారాన్ని మధ్యలోనే సెటిల్ చేయాలని రజినీ నిర్మాతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జైలర్ రిలీజ్కు ఇంకో 20 రోజులే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు.













