‘తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందంటా….’ అలా వుంది ఆర్జీవీ పరిస్థితి
పాలల్లో విషపు చుక్కల తయారయ్యాడు ఈ పరాన్నజీవి ఆర్జీవీ. తన సినిమాకు సపోర్టుగాఎవరు ఎక్కడ దొరుకుతారని అదే పనిమీదున్న వర్మ మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమాను, రాజమౌళిని టార్గెట్ చేసాడు. ఎక్కువమంది దేనిపై ఆసక్తి ఉంటే దాన్నే టార్గెట్ చేయడం ఈ దర్శకుడికి వెన్నతో పెట్టిన విద్య ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ గతంలోనే ఓ ఉచిత సలహా పడేసిన వర్మ… ఇప్పుడు రాజమౌళికి మరో ఉచిత సలహా ఇస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ చూడ్డానికి రేట్ ఫిక్స్ చేయమంటున్నాడు. పవర్ స్టార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న ఆర్జీవీ.. ఆ సినిమా ట్రయిలర్ చూడ్డానికి 25 రూపాయల రేట్ ఫిక్స్ చేశాడు. దీంతో అంతా మూకుమ్మడిగా అతడ్ని తిడుతున్నారు. ఇదేం పాడు సంస్కృతి అంటూ వర్మకు టాలీవుడ్ లోని ప్రముఖులు గడ్డిపెడుతున్నారు
ఓవైపు తనపై ఈ స్థాయిలో తిట్ల వర్షం కురుస్తుంటే.. మరోవైపు వర్మ మాత్రం దున్నపోతుమీద వర్షం పడ్డట్టు ఏ మాత్రం చలించకుండా పక్క వారిని కెలుకుతున్నాడు. ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ కు కూడా రేటు ఫిక్స్ చేయమని రాజమౌళికి ఉచిత సలహా ఇస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎంత విలువ ఉందో, ఆ సినిమా ట్రయిలర్ కు కూడా అంతే విలువ ఉంటుందని.. ఆన్ లైన్ లో ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ కోసం డబ్బులు వెచ్చించి చూడడానికి తామంతా ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశాడు వర్మ. మారుతున్న కాలంలో రాజమౌళి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న వర్మ.. రాజమౌళి నుంచి ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ లేదా ఏదైనా 10 నిమిషాల వీడియో వచ్చినా దానికి బాహుబలి రేంజ్ హైప్ వస్తుందని అభిప్రాయపడ్డాడు.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ కు ఎంత రేటు ఫిక్స్ చేయాలో కూడా చెబుతున్నాడు వర్మ. మల్టీప్లెక్స్ రేంజ్ లో ట్రయిలర్ కు 150 రూపాయలు లేదా 200 రూపాయలు ఫిక్స్ చేస్తే నిర్మాతకు ట్రయిలర్ తోనే డబ్బులన్నీ వచ్చేస్తాయని చెబుతున్నాడు. మొత్తమ్మీద తన పవర్ స్టార్ ట్రయిలర్ ప్రచారం కోసం రాజమౌళిని, ఆర్ఆర్ఆర్ ను చాలా తెలివిగా వాడుకుంటున్నాడు ఈ బిజినెస్ మాన్. ఇలాంటి చావు తెలివితేటలు ఆర్జీవీ.. దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంటాయి.













