షూటింగులకు మొగ్గు చూపుతున్న హీరోలు.. ఇక థియేటర్స్ ఓపెన్ చెయ్యడమే ఆలస్యం!
ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రధానమైనవి థియేటర్స్. అవి కరోనా కారణంగా 5 నెలలుగా మూతబడిపోయాయి. అన్‌లాక్ 4.0 ప్రారంభమైనప్పటికీ థియేటర్లకు మోక్షం లభించలేదు. థియేటర్స్ లేకపోవడం వల్ల ఇప్పటికే కొన్ని సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నప్పటికీ అన్‌లాక్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రప్రభుత్వం. షూటింగులకు సంబంధించి ఇంతకుముందే అనుమతులు లభించాయి. ఆ మేరకు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కొన్ని సినిమాల షూటింగులు ప్రారంభించారు. మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్ ఔట్ ఎట్ ఆలేర్’. సుష్మిత తన భర్తతో కలిసి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కి ‘ఓయ్‘ ఫేమ్ ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నారు. జీ5లో ఈ వెబ్ సిరీస్‌ని రిలీజ్ చేయబోతున్నారు. కో-డైరెక్టర్‌కి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు. దీంతో స్టార్ హీరోలు తమ చిత్రాలను సెట్స్‌పైకి తెచ్చేందుకు భయపడుతున్నారు. లేట్ అయినా ఫర్వాలేదు, కరోనా పూర్తిగా తగ్గిన తర్వాతే షూటింగ్‌కి వస్తాం అని చెప్తున్నారు. కానీ, కింగ్ నాగార్జున మాత్రం ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. అతని తాజా చిత్రం వైల్డ్ డాగ్తోపాటు బిగ్‌బాస్ సీజన్ 4 షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. క్రిష్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్లో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌సిరీస్ `బ్లాక్‌రోజ్` షూటింగ్ కూడా హైదరాబాద్‌లో జరుగుతోంది. కరోనా విషయంలో అందరూ భయపడుతున్నప్పటికీ కొందరు ధైర్యం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు చేస్తున్నారు.
ఇక కొన్నిరోజుల్లో పెద్ద హీరోలు కూడా షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంత కష్టపడి చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత రిలీజ్ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం థియేటర్స్‌కి అనుమతులు లేకపోవడంతో తమ సినిమాలను ఏం చెయ్యాలన్న ఆలోచన నిర్మాతల్లో ఇప్పటి నుంచే కలవరపెడుతోంది. థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా థియేటర్స్‌కి జనం వస్తారా అనే అనుమానం కూడా నిర్మాతల్లో, ఎగ్జిబిటర్స్‌లో ఉంది. ఏది ఏమైనా ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయితే తప్ప ఒక నిర్థారణకు రాలేమని సినీ వర్గాలు అంటున్నాయి.













