వీరమల్లు మొదలయ్యేదెప్పుడో?
మొన్న దసరాకు స్టార్ హీరోల సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. సెట్స్ పైన ఉన్న అన్ని సినిమాల నుంచి వాటికి సంబంధించి ఏవొక అప్డేట్స్ ను ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు మేకర్స్. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాని మెగా156 సైతం సాంగ్ రికార్డింగ్ తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. కానీ హరిహర వీరమల్లు నుంచి మాత్రం మొన్న దసరాకు ఏ అప్డేట్ రాలేదు.
ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్లు వచ్చాయి కానీ ఆయుధమే కీలకంగా ఉన్న వీరమల్లు నుంచి మాత్రం ఎలాంటి వర్కింగ్ స్టిల్ కూడా రాకపోవడం ఆశ్చర్యకరం. ఈ సినిమా గురించి ఎంతో కాలంగా డైరెక్టర్ క్రిష్ మౌనం వ్యవహరిస్తున్నాడు. కానీ ప్రొడ్యూసర్ రత్నం మాత్రం వచ్చే ఏడాది వీరమల్లు రిలీజ్ ఉంటుందన్నారు.
కానీ పరిస్థితులు చూస్తుంటే వీరమల్లు వచ్చే ఏడాది కూడా వచ్చేట్లు కనిపించట్లేదు. మరో మూడు నాలుగు నెలల్లో పవన్ ఎలాగూ బిజీ అయిపోతాడు. జనసేన, టీడీపీ పొత్తు నేపథ్యంలో ఈసారి పవన్ షెడ్యూల్ మరింత బిజీగా ఉండనుంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ ప్రస్తుతం చేస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్సింగ్లలో ఒకటి కంప్లీట్ చేయడమే గగనం. ఎంత త్వరగా అనుకున్నా వీరమల్లు 2024 సమ్మర్ వరకు బ్యాలెన్స్ షూటింగ్‌కు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మరి ఈ సినిమా మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.













