ఒకే రోజు రెండు సినిమాలను స్టార్ట్ చేయనున్న గీతా ఆర్ట్స్
గీతా ఆర్ట్స్ బ్యానర్ మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ సినిమాలను నిర్మించిన అల్లు అరవింద్, చిన్న సినిమాల కోసం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను నిర్మించి దానికి బన్నీ వాసును నిర్మాతగా చేసి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో పలు సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి.
ఈ బ్యానర్లో పెద్ద స్టార్లతో భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే ప్లాన్ ఉన్నప్పటికీ దానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి త్వరలో రెండు కొత్త సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో చైతూ, చందూ మొండేటి కాంబోలో రానున్న సినిమా డిసెంబర్ 9న సెట్స్ మీదకు వెళ్లనుంది.
చైతూ జాలరిగా కనిపించనున్న ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా గుజరాతీ కథ ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటూ రష్మిక మందన్నా హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రానున్న సినిమాను కూడా గీతా ఆర్ట్స్ బ్యానరే నిర్మించనుంది. ఈ సినిమాను కూడా డిసెంబర్ 9 నాడే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. ఈ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లి, సమాంతరంగా షూటింగ్ పూర్తి చేయాలని బన్నీ వాసు ఎంతో ఫోకస్డ్గా ఉన్నాడని తెలుస్తోంది.













