బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వెళ్తానంటున్న గంగవ్వ?
తెలుగులో ఇప్పటివరకు బిగ్‌బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ స్టార్ట్ చేసే ముందు లాక్డౌన్ వచ్చింది. దీంతో ఈ షో ఉంటుందని, ఉండదని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకు సీజన్ 4 సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. ఇప్పటికి తొమ్మిది రోజులైంది. అయితే మునుపటి వాడి, వేడి ఈసారి బిగ్‌బాస్‌లో లేదనిపిస్తోంది. పైగా ఇప్పుడు ఎక్కువ శాతం ప్రజలు ఇంటిపట్టునే ఉంటున్నారు. కాబట్టి షో ఓ రేంజ్లో ఉండాలి. కానీ, దానికి పూర్తిగా రివర్స్‌లో ఏదో అలా నడుస్తోంది తప్ప పెద్ద క్రేజ్ లేదు. ఇదిలా ఉంటే ఈసారి బిగ్‌బాస్‌లో 16 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరిలో గంగవ్వకే ఎక్కువ సపోర్ట్ ఉంది. బయట నుంచి మాత్రమే కాదు.. ఇంట్లో కూడా ఈమెను పెద్దదిక్కులా చూసుకుంటున్నారు. ఆమెకు ఏం కావాలో ప్రత్యేకంగా బిగ్ బాస్ పర్యవేక్షిస్తున్నాడంటే గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు.
అలాంటి గంగవ్వ ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తానంటుంది. ఇదే విషయం నాగార్జునతో సూటిగా చెప్పేసింది కూడా. తనకు ఇంటికి వెళ్లాలని ఉందని చెప్పడంతో నాగార్జున కూడా షాక్ అయ్యాడు. తొలి వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయిన గంగవ్వ.. ఆ తర్వాత ఈ మాటలు చెప్పింది. అందులో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. వెళ్తూ వెళ్తూ స్టేజ్ పైకి వచ్చిన సూర్యకిరణ్ గంగవ్వను ప్రశంసల్లో ముంచెత్తాడు. చీమ తన కంటే 30 రెట్లు బరువు అధికంగా మోస్తుందని.. అందరికీ దారి చూపిస్తుందని చెప్పాడు సూర్య. అలాగే గంగవ్వ కూడా జీవితంలో 30 రెట్లు ఎక్కువ బాధలు అనుభవించిందని.. అందరికంటే ఎక్కువ అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. సూర్య వెళ్లడం మీకు ఎలా అనిపిస్తుంది అవ్వ అని నాగార్జున అడగ్గానే.. రెండు వారాల తాను ఇంటికి వెళ్లిపోయి మళ్లీ సూర్య కిరణ్‌ను ఇంట్లోకి పంపిస్తే బాగున్ను అని చెప్పుకొచ్చింది. నువ్వు వెళ్లిపోతావా అవ్వ అని నాగార్జున అడిగితే.. అవును వెళ్తానంటూ సమాధానమిచ్చింది గంగవ్వ. దానికి నాగార్జున కూడా సరే నేను బిగ్ బాస్‌కు చెప్తానులే అంటూ సమాధానమిచ్చాడు.
అయితే గంగవ్వ ఎందుకు వెళ్లిపోతానంటోందనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం. అందరి కంటే గంగవ్యకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. హౌస్‌లో ఉన్నవారుగానీ, ప్రేక్షకులు గానీ గంగవ్వను పంపించడానికి ఎంతమాత్రం ఒప్పుకోరు అనేది అర్థమవుతోంది. మరి గంగవ్వ హౌస్‌లోనే ఉండటానికి డిసైడ్ అవుతుందా? లేక తను అనుకున్నట్టుగానే బయటికి వెళ్లిపోతుందా? అనేది చూడాలి.













