రీరిలీజుల్లో గబ్బర్ సింగ్ కొత్త రికార్డు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజైన గబ్బర్ సింగ్ సినిమా అంచనాలకు మించి అరాచకం సృష్టించింది. ఈ సినిమా గతంలోనే రెండు మూడు సార్లు రీరిలీజ్ అయింది. దీంతో ఈసారి కలెక్షన్స్ భారీగా ఉండవనుకున్నారంతా. కానీ ఆ అంచనాలను తప్పని నిరూపించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీల నుంచి మచిలీపట్నం వరకు ఎక్కడ చూసినా ఈ సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం అభిమానులు ఈ సినిమా కోసం ఎగబడ్డారంటే గబ్బర్ సింగ్ సెన్సేషన్ ను అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఫస్ట్ డే రూ.6 కోట్లకు పైగానే వసూలు చేసింది.
ఇప్పటివరకు రీరిలీజ్ అయిన సినిమాల్లో ఇదే పెద్ద నెంబర్. తెలుగు రాష్ట్రాల్లో వేసిన షోల నుంచే రూ.5 కోట్ల గ్రాస్ దాటేసింది. మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ రికార్డును టచ్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. ఈ రోజు నుంచి దాదాపు అన్ని చోట్ల గబ్బర్ సింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. సెప్టెంబర్ 5న కొత్త సినిమాలు వచ్చే వరకు గబ్బర్ సింగ్ కు డీసెంట్ ఆక్యుపెన్సీలు ఉండే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.













