రూ.16 కోట్ల సినిమా… రూ.2 వేల కోట్ల వసూళ్లు..! ‘డియర్ యూ’లో అసలేం ఉంది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
స్టార్ హీరోలు లేరు.
భారీ యాక్షన్ లేదు.
పాన్-వరల్డ్ విజువల్స్ లేవు.
విలన్ లేడు.
హీరోకి ఒక్క ఫైట్ కూడా లేదు.
అయినా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ చిన్న చైనా సినిమా… ప్రపంచవ్యాప్తంగా రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
అక్కడితో ఆగలేదు.
ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఒక దేశంలో ప్రేక్షకులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒరిజినల్ వెర్షన్ కోసం డిమాండ్ చేశారు. మరోవైపు, కొందరు విశ్లేషకులు దీన్ని చైనా “సాఫ్ట్ పవర్”లో భాగంగా అభివర్ణించారు. ఒక చిన్న సినిమా… ఇంత పెద్ద చర్చకు ఎలా కారణమైంది?
అసలు ‘డియర్ యూ’ లో ఏముంది?
ఒక కుటుంబ కథ… కానీ అందరిదీ అనిపించే ప్రయాణం
ఈ సినిమా కథ ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. దశాబ్దాల క్రితం చైనాలోని తమ స్వగ్రామాన్ని వదిలి, డబ్బు సంపాదించడానికి కాంబోడియా, థాయిలాండ్ వంటి సుదూర దేశాలకు వెళ్లిన తన తాతయ్యను వెతుకుతూ అతను ప్రయాణమవుతాడు. చైనాలో ఉన్న భార్యకు క్రమం తప్పకుండా డబ్బు (remittances) పంపడం మినహా, ఆ వలసవెళ్లిన వ్యక్తి గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం తెలియదు. తన తాతయ్య అక్కడ బాగా ధనవంతుడై ఉంటాడని, ఆయన సంపాదనతో తన ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఆశపడి ఆ యువకుడు థాయిలాండ్ చేరుకుంటాడు. కానీ, అక్కడ అతనికి ఒక చేదు నిజం తెలుస్తుంది—తన తాతయ్య కొన్నేళ్ల క్రితమే మరణించాడు. అయితే, ఆ వృద్ధుడు తమ పూర్వీకుల గ్రామాన్ని వదిలి వచ్చిన త్యాగం వృధా కాకూడదనే ఉద్దేశంతో, ఆయన మహిళా స్నేహితురాలు ఇప్పటివరకు ఆ డబ్బును చైనాలోని భార్యకు పంపిస్తూ వస్తోంది. చివరికి ఆ వృద్ధురాలైన భార్య, ఈ సహాయం చేసిన మహిళ ఇద్దరూ కలుసుకుంటారు. అక్కడ కన్నీళ్లు కురుస్తాయి.
ఈ కథలో పెద్ద ట్విస్టులు లేవు.
వేగంగా సాగే స్క్రీన్‌ప్లే లేదు.
కానీ చివరికి ప్రేక్షకుడి మనసును నెమ్మదిగా తన వైపు లాక్కునే అరుదైన శక్తి ఉంది.
అందుకే చాలామంది దీనిని సినిమా కంటే… ఒక అనుభూతిగా అభివర్ణిస్తున్నారు.
‘డియర్ యూ’ ఎందుకు అంతగా కనెక్ట్ అయింది?
ఈ సినిమా అమ్మింది యాక్షన్ కాదు. స్టార్డమ్ కాదు. సస్పెన్స్ కాదు. నోస్టాల్జియా.ప్రేక్షకులు తెరపై పాత్రలను మాత్రమే చూడలేదు… తమ కుటుంబాలను చూశారు.తమ తాతలు, అమ్మమ్మలను గుర్తు చేసుకున్నారు. తమ ఇంట్లో ఎన్నోసార్లు వినిపించిన పాత కథలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద బలం.
అసలు హీరో… టియోచు భాష
ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది కథతో పాటు మరో అంశం. అది టియోచు (Teochew) భాష. ఈ చిత్రం చైనా అధికారిక భాష ‘మాండరిన్’ (Mandarin) లో కాకుండా, ‘టియోచు’ (Teochew) భాషలో రూపొందింది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన చావుషాన్ ప్రాంత ప్రజల మాతృభాష ఇది. ఇక్కడే అసలైన భావోద్వేగం దాగి ఉంది. చైనాలోని చావుషాన్ ప్రాంతంలో ఎంతమంది టియోచు ప్రజలు ఉన్నారో, దానికి సమానంగా (దాదాపు 2.5 కోట్లు) చైనా వెలుపల కూడా ఉన్నారు.
ఈ ‘డియర్ యూ’ సినిమా కేవలం టియోచు ప్రజలనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 6 కోట్ల మంది చైనీస్ డయాస్పోరా (వలస ప్రజల) లో మరుగున పడుతున్న మాతృభాషపై మక్కువను, తమ మూలాల అన్వేషణను, కుటుంబ పశ్చాత్తాపాలను, సుదూర మాతృభూమిపై ఉన్న అవ్యక్తమైన అనురాగాన్ని తట్టిలేపింది.
ఈ వలసలన్నీ శతాబ్దాల క్రితం చైనా తీర ప్రాంతాలైన గ్వాంగ్డాంగ్, ఫుజియాన్, హైనాన్ నుండి జరిగాయి. వీరంతా ఇప్పుడు ఆగ్నేయాసియా దేశాలలో అత్యంత సంపన్న వర్గాలుగా స్థిరపడ్డారు. అత్యంత ధనిక దేశమైన సింగపూర్‌లో ఎక్కువ భాగం చైనీస్ సంతతి వారే.
మలేషియాలోనూ వీరి జనాభా ఎక్కువే. ఇక థాయిలాండ్‌లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో చైనీస్ వలసదారులు ఉన్నారు. ఇండోనేషియాలోని శతకోటీశ్వరులలో అత్యధికులు చైనా సంతతికి చెందినవారే. ఈ సినిమా నిజానికి ఈ ఆగ్నేయాసియాలోని ధనిక చైనీయుల గురించే.
డైరెక్టర్ థైర్యం
సాధారణంగా చైనా అధికారిక భాష మాండరిన్‌ను వదిలి, ప్రాంతీయ భాషలో సినిమా తీయడం వాణిజ్యపరంగా పెద్ద రిస్క్‌గా భావిస్తారు అక్కడ దర్శక,నిర్మాతలు. కానీ దర్శకుడు అదే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే… ఆయన దృష్టిలో ఈ కథ ఆ భాషలోనే పుట్టింది. భాషను మార్చేస్తే… పాత్రల ఆత్మ కూడా మారిపోతుందని ఆయన నమ్మాడు. ఆ రిస్క్‌నే ప్రేక్షకులు అతిపెద్ద బలంగా మార్చారు.
సినిమా క్రాఫ్ట్‌లో ఏముంది?
‘డియర్ యూ’ కమర్షియల్ సినిమా ఫార్ములాను అనుసరించదు. ఇక్కడ భారీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంటే నిశ్శబ్దం ఎక్కువగా మాట్లాడుతుంది. అందమైన లొకేషన్ల కంటే పాత్రల ముఖాలపై నిలిచే కెమెరానే ఎక్కువ భావోద్వేగాన్ని పంచుతుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ దర్శకుడు ప్రేక్షకుడిని ఏడిపించడానికి ప్రయత్నించడు. కానీ పాత్రల జీవితాన్ని నిజాయితీగా చూపిస్తాడు. అదే చివరికి మనసును తాకుతుంది.
వివాదం కథపై కాదు… భాషపైనే
సినిమా విడుదలైన తర్వాత అసలు సంచలనం సింగపూర్‌లో మొదలైంది. అక్కడ తొలుత ఒరిజినల్ టియోచు వెర్షన్‌కు పరిమిత ప్రదర్శనలే ఇచ్చారు. మాండరిన్ డబ్బింగ్‌కు మాత్రం పెద్ద ఎత్తున స్క్రీన్లు కేటాయించారు. అక్కడ ప్రేక్షకులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి వాదన ఒక్కటే.
“ఈ సినిమా బలం దాని భాష. డబ్బింగ్‌తో ఆ అనుభూతి పోతుంది.”
ఫలితం…మొదట కొన్ని షోలకే పరిమితమైన ఒరిజినల్ వెర్షన్… ప్రేక్షకుల ఒత్తిడితో వందలాది అదనపు ప్రదర్శనలను దక్కించుకుంది. కేవలం 10 స్క్రీనింగ్‌లతో ప్రారంభమైన ‘డియర్ యూ’ ఒరిజినల్ వెర్షన్ ప్రదర్శనలు ఏకంగా 300కు పెరిగాయి. ఒక సినిమా కోసం ప్రేక్షకులే భాషా విధానంపై చర్చ మొదలుపెట్టడం అరుదైన సంఘటన.
చైనాలో మాత్రం మరో కథ
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మాండరిన్ మాట్లాడే చైనా ప్రధాన భూభాగంలో ఈ సినిమాను టియోచు భాషలోనే విడుదల చేశారు. చాలామందికి ఆ భాష తెలియదు. అయినా సబ్‌టైటిల్స్‌తో సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఇది ఒక విషయం స్పష్టం చేసింది. ప్రేక్షకులు మంచి కథను అర్థం చేసుకోవడానికి భాష అడ్డంకి కాదని.
రాజకీయ వ్యూహం?
ప్రాంతీయ భాషల వాడకాన్ని కొన్నేళ్ల పాటు నియంత్రించిన బీజింగ్ (చైనా ప్రభుత్వం), ఇప్పుడు కాస్త సరళమైన విధానాన్ని అనుసరిస్తోంది. ప్రముఖ దర్శకుడు వాంగ్ కార్-వై ఇటీవల షాంఘైకి చెందిన ‘వు’ (Wu) భాషలో 30 భాగాల టీవీ సిరీస్‌ను రూపొందించారు. అలాగే హాంగ్‌కాంగ్, గ్వాంగ్డాంగ్లలో మాట్లాడే ‘కాంటోనీస్’ భాష కూడా ఇప్పుడు చైనా ఆన్లైన్ చాటింగ్‌లలో, మాండరిన్ భాషలో విస్తృతంగా వాడుకలోకి వస్తోంది.
ఇక సింగపూర్‌కు చెందిన ఒక వ్యాఖ్యాత ఈ సినిమాపై స్పందిస్తూ—విదేశాల్లో ఉన్న చైనీయుల సానుభూతిని పొంది, భవిష్యత్తులో వచ్చే ఘర్షణల సమయంలో వారిని తమ వైపు తిప్పుకోవడానికి బీజింగ్ చేసిన ‘సూక్ష్మమైన, రహస్యమైన వ్యూహం’ ఇదని ఆరోపించడంతో పెద్ద దుమారం రేగింది.
దీనికి నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, “ఇది కేవలం ఒక సినిమా మాత్రమే” అని కొట్టిపారేశారు. ప్రొ-బీజింగ్ పత్రిక అయిన ‘చైనా డైలీ హాంగ్‌కాంగ్’ కాలమిస్ట్ కూడా, “ప్రతి భావోద్వేగ స్పందనను రాజకీయ కోణంలో చూడటం సంస్కృతిని ఒక వ్యూహంగా మార్చడమే అవుతుంది, ఇది ప్రేక్షకుల సొంత ఆలోచనా శక్తిని హరించడమే” అని పేర్కొన్నారు.
ప్రపంచ సినీ విమర్శకులను ఆకట్టుకున్న అంశం
విమర్శకులు ఈ సినిమాను కేవలం కథ కోసం మాత్రమే మెచ్చుకోలేదు. చిన్న చిన్న భావోద్వేగ క్షణాలను పెద్ద డ్రామాగా మార్చకుండా చూపించిన తీరు… ప్రాంతీయ భాషను సినిమాకు హృదయంగా నిలబెట్టిన ధైర్యం… సహజమైన నటన… ఇవే ‘డియర్ యూ’ను సాధారణ ఫ్యామిలీ డ్రామా నుంచి ప్రత్యేక చిత్రంగా మార్చాయని అభిప్రాయపడ్డారు.
ఏదైమైనా…
ప్రతి ఏడాది వందల సినిమాలు విడుదలవుతాయి. కొన్ని బాక్సాఫీస్ హిట్లు అవుతాయి. కొన్ని అవార్డులు గెలుస్తాయి. కొన్ని విడుదలైన వారం రోజుల్లోనే మరచిపోతాం. కానీ చాలా అరుదుగా మాత్రమే… థియేటర్‌ను దాటి భాష గురించి మాట్లాడేలా…సంస్కృతి గురించి ఆలోచించేలా… ప్రేక్షకుల వ్యక్తిగత జ్ఞాపకాలను మళ్లీ తడిమేలా చేసే సినిమాలు వస్తాయి.’డియర్ యూ’ అలాంటి అరుదైన చిత్రాల్లో ఒకటి.
అందుకే ఈ సినిమా విజయం దాని కలెక్షన్లలో మాత్రమే లేదు.
ఒక చిన్న ప్రాంతీయ భాషలో తీసిన సినిమా… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసులను ఎలా కదిలించగలదో నిరూపించడంలో ఉంది.








