Neena Gupta: ఆ పాత్రలు నచ్చకపోయినా చేశా.. ఎందుకంటే
ఇండస్ట్రీలో కొనసాగడానికి ఎన్నో పాట్లు పడాలి. హీరోల నుంచి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు ఎవరైనా అంతే. హీరోయిన్ల విషయంలో ఈ ఇబ్బందులు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా చెప్పగా, తాజాగా సీనియర్ నటి నీనా గుప్తా(neena gupta) తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని బయటపెట్టారు.
తన కెరీర్ లో కొన్ని సినిమాలు, కొన్ని పాత్రల్లో నటించినందుకు తాను బాధ పడ్డానని, కొన్ని తనకు నచ్చకపోయినా చేయాల్సి వచ్చిందని, దానికి తన ఆర్థిక ఇబ్బందులే కారణమని నీనా గుప్తా చెప్పారు. అవకాశాలు లేకపోవడంతో మంచి క్యారెక్టర్లు కాకపోయినా, తాను వాటిని డబ్బు కోసం చేయాల్సి వచ్చిందని, నటిగా ఆ సినిమాలేవీ తనను శాటిస్ఫై చేయలేకపోయాయని ఆమె చెప్పారు.
ఇప్పటికీ కొన్ని పాత్రల విషయంలో బాధ పడుతుంటానని, ఆ సినిమాల షూటింగ్ టైమ్ లో ఇంటికొచ్చాక అవి రిలీజ్ కాకపోతే బావుండని కోరుకునే దాన్నని, సెట్స్ లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కోవడంతో పాటూ కొంతమంది డైరెక్టర్లు కారణం లేకుండానే తనను అసభ్య పదాలతో తిట్టారని, అయినా సరే డబ్బు అవసరం ఉండటంతో తాను ఆ సినిమాను చేసినట్టు నీనా గుప్తా వెల్లడించారు. నీనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్ హాట్ టాపిక్ గా మారాయి.













