భారీ ఆఫర్ పట్టేసిన డబుల్ ఇస్మార్ట్
మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ ను మేకర్స్ వేగవంతం చేశారు. ఆగస్ట్ 15న ఈ సినిమాతో పాటూ మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశాయి. కానీ ఆ సినిమాలు వాయిదా పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూరీ- రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. లైగర్ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని పూరీ చాలా జాగ్రత్తగా తీసిన సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవాలని చూస్తున్నాడు పూరీ. ది వారియర్, స్కంద సినిమాల డిజాస్టర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని ఎంతో నమ్మకంతో రామ్ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.60 కోట్లకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
అందులో రూ.6 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ గా ఉంటుంది. రికవరీ అవాలంటే సినిమా కచ్ఛితంగా రూ.100 కోట్ల గ్రాస్ దాటాలి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ డీల్ ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. రికవరీ మొత్తం అయ్యాక 20% కమీషన్ తీసుకునేలా డీల్ కుదుర్చుకున్నారట. ఒక ఫ్లాప్ హీరో, ట్రాక్ లో లేని డైరెక్టర్ కాంబోకి ఇంత భారీ మొత్తంలో బిజినెస్ జరిగిందంటే అది ఇస్మార్ట్ శంకర్ ప్రభావమనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













