బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న సుమంత్ ప్రభాస్
ఈ మధ్య ఎలాంటి సినిమాకైనా సరే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం చాలా కష్టమైంది. స్టార్ హీరోల సినిమాలకైతే పర్లేదు కానీ కొత్త వాళ్ళతో వచ్చే సినిమాలైతే ఇక ఆ ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఫస్ట్ లుక్ నుంచి పాటలు, ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి ఎంతో ఇంట్రెస్టింగ్ గా, ఇంటెన్స్ గా ఉంటే తప్ప ప్రేక్షకులు కన్విన్స్ అయ్యి థియేటర్లకు రావడం లేదు.
అలాంటిది 23 ఏళ్ల కుర్రాడు సుమంత్ ప్రభాస్ హీరోగా తనే దర్శకత్వం వహిస్తూ చేసిన మేమ్ ఫేమస్ సినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేయగలిగింది. రిలీజ్ ముందు రోజు హైదరాబాద్లో కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ వేయగా, అవన్నీ ఫుల్స్ అయ్యాయి. అంతేకాదు రిలీజ్ రోజు మార్నింగ్ షో లు కూడా దాదాపు హౌస్ ఫుల్స్ అయ్యాయి.
కానీ ఎంతో ఆశపడి సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు మేమ్ ఫేమస్ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే జాతిరత్నాలు లాగా మంచి ఎంటర్టైనర్ అవుతుందనుకున్నారు. వాస్తవానికి మేమ్ ఫేమస్ మూవీ జాతిరత్నాలను అనుకరిస్తున్నట్లు ఉన్నపటికీ, ఈ సినిమాలో మాత్రం కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి.
కొన్ని జోక్స్, కామెడీ సీన్స్, క్యారెక్టర్లు బాగా పండినప్పటికీ, సినిమా మొత్తం ఒకటే టెంపో మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సుమంత్ ఫెయిలయ్యాడు. ఫస్టాఫ్ లో మెయిన్టైన్ చేసినట్లే సెకండాఫ్ ను నడింపించి ఉంటే సినిమా మంచి సక్సెస్ అయ్యేది. ఇప్పుడు మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అన్నీ మంచిగా జరిగి సినిమా సక్సెస్ అయి ఉంటే సుమంత్ ప్రభాస్ కెరీరే మారిపోయి ఉండేది. ఓ రకంగా చెప్పాలంటే సుమంత్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.













