ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ పరిస్థితేంటి?
కళ్యాణ్ కృష్ణ. టాలీవుడ్ లో ఇతనికి మంచి ట్రాక్ రికార్డే ఉంది. మొదటి సినిమా సోగ్గాడే చిన్ని నాయనాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ, తన రెండో సినిమా రారండోయ్ వేడుక చూద్దాంతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రవితేజతో తీసిన నేల టికెట్టు సినిమా ఫ్లాప్ అయింది. కానీ నాలుగో సినిమా బంగార్రాజు తో మళ్లీ హిట్టు కొట్టాడు.
తీసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు హిట్లే. కానీ తన ప్రతీ సినిమా సెట్స్ కు వెళ్లే వరకు జరిగే ఆలస్యం మాత్రం మారడం లేదు. నేల టికెట్టు తర్వాత బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే టైమ్ పట్టింది. బంగార్రాజు తర్వాత చిరంజీవితో సినిమా ఓకే అయి, అనౌన్స్మెంట్ కూడా జరిగింది.
కానీ సెట్స్ పైకి వెళ్లే టైమ్ కు ఆ సినిమా రీమేక్ అని చిరూ పక్కన పెట్టేశాడు. భోళా శంకర్ సినిమా రిజల్ట్ తో ఇక రీమేక్స్ జోలికి వెళ్లకూడదనుకున్న నేపథ్యంలో చిరూ ఈ సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే విశ్వంభర తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమా చేస్తాడనుకున్న అందరికీ చిరూ ఇప్పుడు షాక్ ఇచ్చాడు.
విశ్వంభర తర్వాత చిరూ, హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఆ సినిమాను తన కూతురు సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అంటే కళ్యాణ్ కృష్ణ సినిమా క్యాన్సిల్ అయినట్లే. దీంతో ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ మరో కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేసుకోవాల్సిం వచ్చింది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ కృష్ణ, తనకు లక్కీ హీరో అయిన నాగ్ దగ్గరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి నాగ్ అయినా కళ్యాణ్ కు ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.













