కమెడియన్ కెరీర్ టర్నింగ్ సినిమా
దాదాపు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కమెడియన్ సత్యకు సరైన బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. తెలుగులో సునీల్ తర్వాత అలాంటి టిపికల్ కామెడీ టైమింగ్ ఉండి, చూడగానే నవ్వు తెప్పించేది మాత్రం సత్యనే. చాలా ఏళ్ల పాటు చిన్న పాత్రలకే పరిమితమైన సత్య గత కొన్నేళ్ల నుంచే ఎదుగుతున్నాడు.
మత్తు వదలరా, రంగబలి సినిమాల్లో తన కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన సత్య, తను హీరోగా చేసిన వివాహ భోజనంబు సినిమాలో నవ్వించడంతో పాటూ కన్నీళ్లు కూడా పెట్టించాడు. అయితే గతంతో పోలిస్తే సత్య ఇప్పుడు చాలా బిజీ అయ్యాడు. కానీ తనలో ఇప్పటివరకు చూడని టాలెంట్ చాలానే ఉందని నిరూపించింది రీసెంట్ గా వచ్చిన మత్తు వదలరా2 సినిమా.
ఈ సినిమా మొదటి షో పడిన దగ్గర నుంచి ఎక్కడ విన్నా సత్య పేరే మార్మోగుతుంది. సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులన్నప్పటికీ అందరి కంటే ఎక్కువ హైలైట్ అయింది మాత్రం సత్యనే. సినిమా హిట్ అవడంలో కీలక పాత్ర పోషించింది కూడా అతనే. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ లోనూ సత్య చెలరేగిపోయాడు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ మత్తు వదలరా2 కు బాగా ప్లస్ అయ్యాయి. సత్య కెరీర్లోనే ఈ సినిమా బిగ్ టర్నింగ్ పాయింట్ అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.













