అలీపై నిప్పులు చెరుగుతున్న పవర్‌స్టార్ ఫ్యాన్స్!
సినిమా ఇండస్ట్రీలో మిత్రులు ఉండరు, శత్రవులూ ఉండరు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో.. ఎప్పుడు ఎవరితో కలిసి పనిచెయ్యాల్సి వస్తుందో చెప్పలేం. కాబట్టే ఈరోజు తిట్టుకున్నవారు కూడా రేపు హలో అంటే హలో అనుకుంటారు. పాత విషయాలను మర్చిపోతారు. అయితే కొందరి విషయంలో అలా జరగదు. వారి మధ్య దూరం అలాగే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే పవన్ కల్యాణ్, అలీ మంచి ఫ్రెండ్స్. గోకులంలో సీత చిత్రంలో మొదటిసారి పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించాడు అలీ. ఆ తర్వాత వరసగా తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి, బద్రి వంటి సూపర్‌హిట్ సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. దాంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
ఎప్పుడైతే పవన్‌కల్యాణ్ రాజకీయాల వైపు వెళ్లడం, అలీ వైసీపీలో చేరడంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. తాజా వార్త ఏమిటంటే సెప్టెంబర్ 2 పవన్‌కల్యాణ్ పుట్టినరోజు. దాదాపు నెల పదిహేను రోజులు ఉంది. అయినా అభిమానులు ఇప్పటి నుంచే హడావిడి మొదలు పెట్టారు. పవన్‌కల్యాణ్‌కు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. పనిలో పనిగా సెలబ్రిటీలు కూడా వారి దారిలోనే వెళ్తూ పవన్‌కి విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో అలీ కూడా పవన్‌కి అడ్వాన్స్‌గా విషెస్ తెలియజేశాడు.
`వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం, గుణం, వర్ణం గురించి మాట్లాడతారు. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి, నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్‌కల్యాణ్` అని ట్వీట్ చేశాడు అలీ. దీనిపై అభిమానుల్లో చర్చ మొదలైంది. అతనిపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే అలీ రాజకీయాల్లో లేకపోయినా వైసీపిలో ఉన్నాడు. ఈమధ్యకాలంలో వైసీపిని పవన్‌కల్యాణ్ ఏదో ఒక విషయంలో విషయంలో విమర్శించడం చూస్తూనే ఉన్నాం. అన్నీ మర్చిపోయి పవన్‌ను పొగుడుతూ పాజిటివ్‌గా అలీ ట్వీట్ చేసినప్పటికీ దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు అభిమానులు. `నువ్వు చేసిన మోసం అంత త్వరగా ఎలా మర్చిపోతాం` అంటూ అలీకి రిప్లయి ఇచ్చారు పవనస్టార్ ఫ్యాన్స్. మరి ఈ సమాధానానికి అలీ ఎలా స్పందిస్తాడో, ఏమని సమాధానమిస్తాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.













