చిత్ర లహరికు సీక్వెల్
బ్రో సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన సాయి ధరమ్ తేజ్ ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదు. తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే మాస్ ఎంటర్టైనర్ ను అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత నుంచి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. బడ్జెట్ కారణాల వల్ల సినిమా ఆగిపోయిందంటున్నారు కానీ ఈ విషయంలో మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.
అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మరో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ కు ఉన్న హిట్స్ లో ఒకటిగా ఉన్న చిత్ర లహరి సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు.
గత కొన్ని సినిమాలుగా కిషోర్ తిరుమల ట్రాక్ రికార్డు ఏమంత ఆశాజనకంగా లేదు. ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమా సో సోగా ఆడింది. రెడ్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకే ఓ స్టార్ హీరో మూవీ కూడా చేతుల వరకు వచ్చి జారిపోయిందని తెలుస్తోంది. దీంతో కిషోర్ తిరుమల చిత్ర లహరి2పై కాన్సన్ట్రేట్ చేశాడని సమాచారం. యూత్ లో చిత్ర లహరి సినిమాకు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని, సాయి ధరమ్ తేజ్ మార్కెట్ లిమిట్స్ లోనే ఈ సినిమాను నిర్మించాలని చూస్తున్నారట. కాకపోతే ఆ సినిమాకు కొనసాగింపుగా కథ ఉండదని తెలుస్తోంది. కేవలం టైటిల్ను మాత్రమే వాడుకోనున్నారని, కథ మొత్తం కొత్తగా ఉంటుందని అంటున్నారు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట.













