మంచి రోజులు రానున్నాయి: చిరంజీవి
కరోనా క్రై సిస్ ఛారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో సినీ కార్మికులకు మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభమైందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక బహిరంగ వీడియో విడుదల చేశారు. కరోనా, లాక్డౌన్ నేపధ్యంలో వేలాది మంది సినీ కార్మికులు, సంబంధిత వర్గాలు ఉపాధి కోల్పోవడంతో వారికి సాయం చేసేందుకు ఏర్పాటైన కరోనా క్రై సిస్ ఛారిటీ సినీ ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి కార్మికులకు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
మూడవ విడత పంపిణీ ప్రారంభించిన సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలీని పరిస్థితి ఉందని అందుకే మరో విడత పంపిణీ చేపట్టామన్నారు. ఈసారి పంపిణీలో సినీ జర్నలిస్టులతో సహా డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, పోస్టులు అందించే కార్మికులను కూడా భాగం చేయాలని నిర్ణయించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు పదివేల మందికి వీటిని అందిస్తున్నామన్నారు. ’కరోనా మనకేం రాదులే.. మనకేం కాదులే’ అన్న నిర్లక్ష్య ధోరణి ఎవ్వరికీ వద్దని అనుక్షణం అప్రమత్తంగా ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ కుటుంబాల్ని రక్షించుకోవాలన్నారు. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండబోవని మన అందరం పనిచేసుకుంటూ సంతోషంగా ఉండే రోజు దగ్గర్లోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గణనాథుడు గట్టెక్కించాలని కోరుతూ, అందరూ ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.













