సినీకార్మికులకు ‘కరోనా క్రైసిస్ చారిటీ’ (సీసీసీ) మరోసారి నిత్యావసరాలు !
సినీ కార్మికుల కోసం చిరంజీవి ప్రారంభించిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’ (సీసీసీ) సినీకార్మికులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. సీసీసీ ద్వారా మరోసారి కార్మికులకు నిత్యావసరాల్ని వారి అసోసియేన్ల ద్వారా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“నిత్యావసర వస్తువులను తిరిగి పంపిణీ చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఇంకా షూటింగులు మొదలుకాలేదు. అందువల్ల ఎవరికీ పనిలేదు. ఇంకా లాక్డౌన్ పరిస్థితులే కొనసాగుతున్నాయి. అందుకే అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వాలని సీసీసీ కమిటీలో నిర్ణయించాం.అందరి పరిస్థితిని అర్థం చేసుకోగలను. త్వరలో కరోనా మహమ్మారిని అధిగమిద్దాం. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోండి. పని ముఖ్యమే. ప్రాణం అంతకన్నా ముఖ్యం. పెద్దలను, చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎవరూ అధైర్యపడవద్దు.మళ్లీ అందరం చేతినిండా పనితో ఉంటాం. ఎప్పుడూ సీసీసీ కార్మికులకు అండగా ఉంటుంది“ అని అన్నారు..
దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ-“ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సినిమా కార్మికులకు అండగా ఉండాలనే గొప్ప సంకల్పంతో చిరంజీవిగారు సీసీసీ మనకోసం ప్రారంభించారు . చిరంజీవి గారి ఆలోచనకు బలాన్నిస్తూ హీరోలు నిర్మాతలు దర్శకులు తమ వంతు విరాళాలిచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మొదటి విడతగా 13 వేల మంది కార్మికులకు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను వారి ఇళ్లకే చేర్చడం జరిగింది. ఇప్పుడు కార్మిక నాయకులు నిబద్ధతతో.. నిజంగా అవసరం ఉన్న కార్మికుల లిస్టుని కమిటీకి అందజేయడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా ఆ నాయకులను అభినందిస్తూ రెండోసారి నిత్యావసర వస్తువులను ఇవ్వడానికి సమాయత్తమైంది. నిజంగా అవసరం ఉన్న సభ్యులు మాత్రం తీసుకోవడం వలన అవసరమైతే మూడో విడత కూడా పేద కార్మికులకు అందించాలనే ఆలోచన చిరంజీవి గారికి ఉంది. ఈసారి అదనంగా రెండు రాష్ట్రాల్లో ఉన్న సినిమా రిప్రజెంటేటివ్స్ కు మరియు పోస్టర్స్ పేస్టింగ్ చేసే కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది .నిత్యవసర సరుకులు అవసరం లేని వారు తీసుకోవద్దని, అవసరం ఉన్నవారు మాత్రమే తీసుకుంటే బాగుంటుందని సిసిసి కమిటీ విజ్ఞప్తి చేస్తుందని చెప్పారు.













