అలా చేద్దామనుకున్నాను.. కానీ సాధ్యం కాలేదంటున్నరాజమౌళి!
ఇటీవలికాలంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఇప్పటికీ చికిత్స పొందుతుండగా, మరికొందరు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీ బాడీస్ ఉంటాయని, అందువల్ల వారు ప్లాస్మాను దానం చేస్తే కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నవారి ప్రాణాలు కాపాడడంలో అది ఉపయోగపడుతుందని గత కొంతకాలంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసు శాఖ ముందుకు వచ్చి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆమధ్య రాజమౌళి కుటుంబం కూడా కరోనా బారిన పడింది. వారి కుటుంబంలోని చాలా మంది తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకొని కోలుకున్నారు.
ఇటీవల పోలీసు శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ప్లాస్మా దానం విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. తాను కరోనా నుంచి కోలుకున్నానని, త్వరలోనే ప్లాస్మా దానం చేస్తానని ప్రకటించారు. అయితే ఇటీవల రాజమౌళి సోదరుడు కీరవాణి, ఆయన కుమారుడు కాలభైరవ ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంలో రాజమౌళి కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్లాస్మా దానం చేస్తానని ప్రకటించిన రాజమౌళి ఎందుకు వెనక్కి తగ్గాడు అనే సందేహం అందరికీ కలిగింది. ఈ విషయంలో రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కరోనా సమయంలో ఏర్పడిన యాంటీబాడీస్ కొద్దిరోజులు మాత్రమే ఉంటాయని, అందుకే ఆ సమయం లోపలే దానం చేయాలని చెప్పారు. తను యాంటీ బాడీస్ టెస్ట్ చేయించుకున్నానని, ఐఐజి లెవల్స్ 8.62 మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్లాస్మా దానం చేయాలంటే యాంటీ బాడీస్ 15 ఉండాలని తెలిపారు.













