భాస్కర్ ఈ సారైనా ఆ జానర్లో హిట్టు కొడతాడా?
మొదటి సినిమా బొమ్మరిల్లుతోనే తన పేరును బొమ్మరిల్లు భాస్కర్ గా మార్చుకున్నాడు డైరెక్టర్ భాస్కర్. ఆ తర్వాత పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు చేశాడు. వీటిలో ఒంగోలు గిత్త తప్ప మిగిలినవన్నీ మంచి క్లాసిక్ సినిమాలనిపించుకున్నాయి. కానీ భాస్కర్ కు మాత్రం మొదటి నుంచి మాస్ డైరెక్టర్ అనిపించుకోవాలనే ఇష్టం.
అందుకే రామ్ తో ఒంగోలు గిత్త చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగలడంతో మళ్లీ ఆ జానర్ కు వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు భాస్కర్ అదే జానర్ లో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనౌన్స్ అయిన కొత్త సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో తుపాకీల మోత కూడా కాస్త ఎక్కువగానే ఉండనున్నట్లుంది. ఈ సినిమాకు మంచి బ్యాకెండ్ సపోర్ట్ కూడా ఉండటం, బడ్జెట్ పరిమితులు లేకపోవడంతో ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించనున్నాడు భాస్కర్. ఈ సినిమా కథ రాయడానికి కూడా భాస్కర్ చాలా ఎక్కువ టైమే తీసుకున్నాడు.













