అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో ఊరట
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి వేసిన వ్యాజ్యం పై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. నవంబరు 6న తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వచ్చారు. వైసీపీ శ్రేణులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయన్ను తీసకువచ్చారు. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై అప్పట్లో నంద్యాల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.













