బెనర్జీకి ఉత్తమ నటుడు పురస్కారం
ముంబైలోని లోనావాలాలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన వరల్డ్ సినీ ఫెస్ట్ లిఫ్ట్ ఇండియా చిత్రోత్సవంలో రక్తం చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా బెనర్జీ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రాన్ని రాజేష్ టచ్ రివర్ రూపొందించారు. సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ నిర్మించారు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు బెనర్జీ కావడం గమనార్హం. విప్లవం తుపాకులతోనే సాధించాలా? లేక ప్రేమతో కూడా సాధించవచ్చా? అనే సంఘర్షణపై ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. ఇందులో శంకరన్న పాత్రలో విప్లవ నాయకుడిగా బెనర్జీ కనబరిచిన ప్రతిభకు చిత్రోత్సవాలలో చక్కటి ఆదరణ లభించింది. గతంలో అమెరికాలోని ఓహియోలో జరిగిన ఇండీ గేదరింగ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో కూడా ఆయన పోషించిన ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా నామినెట్ అయిన తొలి భారతీయ నటుడు బెనర్జీ కావటం విశేషం. అంతేకాక రక్తం ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటో గ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్ ఎడిటింగ్, ఉత్తమ చిత్రం విభాగాలలో పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు నామినేట్ అయ్యింది.













