వర్మ ఆఫీసుపై దాడి..చేతులు కట్టుకుని కూర్చోలేదన్న వర్మ..
పవర్ స్టార్ సినిమా వివాదం అనుకున్న మలుపే తిరిగింది. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావించే ఆయన ఫ్యాన్స్ వర్మపై ఆగ్రహంతో ఊగిపోయారు. పవర్‌స్టార్ సినిమాపై ఓయూ జెఎసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బంజారాహిల్స్‌లోని వర్మ ఆఫీసుపై గురువారం రాళ్ల దాడి జరిగింది. ఆయన ఆఫీస్‌పై ఓయూ విద్యార్ధులు దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వర్మ ఓ చానెల్‌తో మాట్లాడుతూ తన ఆఫీస్ మీద దాడికి తగిన సమాధానం చెబుతానని, తానేమీ చేతులు కట్టుకు కూర్చోలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే…
ఏ పార్టీకి చెందిన వాడ్ని కాను…
నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాను. పవర్‌స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా చూపించాననేది అపోహ మాత్రమే. ఇలాంటి దాడులు చేసినా ఎవరికీ భయపడేది లేదు. ఆఫీసుపై దాడి రౌడీయిజమే దీని ద్వారా నాకు మరింత పబ్లిసిటీ ఇస్తున్నారంతే. ఆ యువకులు తన ఆఫీస్‌పై దాడి చేయలేదు. వాళ్లు మాట్లాడడానికి వస్తే మా ఆఫీస్ స్టాఫే వాళ్లపై దాడి చేశారనేది అబద్ధం. వాళ్లు దౌర్జన్యంతో లోపలకి వచ్చారు. నా ఆఫీస్ అంతా సిసి టివి కెమెరాలున్నాయి. వీడియోలు ఉన్నాయి. వాళ్లు నాదగ్గరకు రావాల్సిన అవసరం లేదు. వారేవరో నాకు తెలీదు. నాతో మాట్లాడాల్సిన అవసరమూ లేదు. ఏదో మీడియాలో నన్ను అటాక్ చేస్తారు అంటే ఆన్సర్ ఇచ్చా అంతే. అయినా ఎవరైనా ఎవరినైనా ఎటాక్ చేయవచ్చు. దానికి రియాక్షన్ ఉంటుంది కదా తర్వాత? అదేం పెద్ద విషయం కాదు. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు అయినా చెప్తే అర్ధం చేసుకునే మైండ్స్ ఉన్నవాళ్లు ఇలాంటి దాడులవి చేయరు. అలాంటివి చేసినప్పుడు నా రియాక్షన్ నా స్టైల్లో ఉంటుంది. ఏం చేసినా ఊరుకోవడానికి ఇక్కడ చేతులు కట్టుకుని ఎవరూ కూర్చోలేదు.
నా మీద వ్యతిరేకంగా వందల వీడియోలున్నాయి. 20 ఏళ్లుగా చూస్తున్నా. నా జీవితంలో ఎప్పుడూ ఎవరినీ అలా చేయవద్దు ఇలా చేయవద్దు అనలేదు. పరాన్న జీవి గురించి మాట్లాడేదేమీ లేదు. అయినా నా సినిమాతో బిజీగా ఉన్నా కాబట్టి ఎవరి సినిమా గురించి మాట్లాడను. గత 3 రోజుల్లో 30 ఇంటర్వ్యూలు ఇచ్చా. ఆ మాటల నుంచి ఎవరికి ఇష్టం వచ్చినవి వారు తీసుకోవచ్చు. నా మీద సినిమా తీయవద్దు అని ఒక్కశాతం కూడా ఎవరినీ అడగను. పోర్న్ చూస్తా, వోడ్కా తాగుతా, అమ్మాయి తొడలంటే ఇష్టం అని స్వయంగా నేనుచెప్పా నా గురించి నేను ఇలా చెప్పుకున్నాక ఇక నా గురించి ఏం ఉంది ఎవరికైనా చెడుగా చెప్పడానికి? ఎవరి మీదా నాకు కోపం రాదు. అసలు ఇంకొకరి మీద కోపం వచ్చేంత విలువ నేనెవ్వరికీ ఇవ్వను.
అది ఫిక్షనల్ స్టోరీ…
పవర్ స్టార్ అనేది ఫిక్షనల్ స్టోరీ. రియలిస్టిక్ క్యారెక్టర్స్ మీద ఆధారపడి తీసింది. ఇది బయోపిక్ కాదు. ఇది కేవలం ఊహించి రాసిన కధ. హిట్లర్ మీద 37 సినిమాలు వచ్చాయి. గాంధీ గారి మీద కూడా వచ్చాయి. ఒక సెలబ్రిటీ మీద ఫిల్మ్ మేకర్ అభిప్రాయ వ్యక్తీకరణ ఇది. అంతే. ఏ డైరెక్టరైనా పబ్లిక్ రీచ్ అవ్వాలనే సినిమా తీస్తాడు కాని అది ఎంత వరకూ రీచ్ అవుతుందని ఎవరూ చెప్పలేరు. 2005లో సర్కార్ తీశా, రక్త చరిత్ర తీశా, లక్ష్మీస్ ఎన్టీయార్ తీశా. ఒటిటి ఉంది కదా అని తీస్తున్నానడంలో అర్ధం లేదు. ఒటిటికి సినిమా తీయడానికి సంబంధం లేదు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ఇంకా ఇలాంటివి తీస్తా. ఎన్ని సినిమాలైనా ఎవరి మీద వచ్చినా సరే.. జనం నచ్చింది చూస్తారు. ఇక ఈ సినిమాకు ఎంత ఖర్చు అయింది, వంటి విషయాలు చెప్పను. వర్కవుట్ అవదనుకుంటే ఎందుకు తీస్తా? పవన్ అభిమానులు మెచ్చే సినిమా ఇది… చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ చూసి పాజిటివ్‌గా ఫీలవుతారు అని నా నమ్మకం. నిజానికి పవన్‌కి అందరికన్నా నేను పెద్ద అభిమానిని.
న్యూడిటీ గురించి…
ఒక్క సినిమా తీసి నేరుగా అది ఎరోటిక్ సినిమా అని ప్రకటించాను. మిగతా కరోనా వైరస్, మర్డర్, పవర్‌స్టార్ వంటిసినిమాల్లో ఏమీ న్యూడిటీ లేదు కదా మరి నేను న్యూడ్ సినిమాలు మాత్రమే తీస్తా అని ఎలా అంటున్నారు? మీకు అవి మాత్రమే గుర్తుంటున్నాయి కాబట్టి.













