పవన్ కోసం అనుకుంటే బాలయ్య ఫిక్స్ చేసుకున్నాడు
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ ని సెట్ చేసుకోవడం ఎంత కష్టమో, వాళ్ల సినిమాలకు ధీటైన విలన్‌ను దొరికించుకోవడం అంతకంటే పెద్ద సవాల్‌గా మారింది. అప్పట్లో ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే, ముఖేష్ ఋషి రూపంలో మంచి విలన్లు ఉండేవారు కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. మరోవైపు ప్రకాష్ రాజ్, రావు రమేష్ రొటీన్ అవుతున్నారనే మాట తెలుగు ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి, బాలయ్యతో చేస్తున్న సినిమా కోసం చాలా తెలివిగా విలన్ ను సెలెక్ట్ చేశాడు. బాలయ్య108 కోసం అర్జున్ రామ్ పాల్ ని విలన్ గా అనౌన్స్ చేస్తూ చిన్న వీడియో బైట్ తో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. వాస్తవానికి అర్జున్ రామ్ పాల్ ని పోయిన ఏడాది హరిహర వీరమల్లు కోసం ప్లాన్ చేసుకున్నారు.
కానీ ఆ ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అవడంతో పాటూ అర్జున్ రాంపాల్ డేట్స్ క్లాష్ అవుతుండటం వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ ప్లేస్ లోకి బాబీ డియోల్ చేరాడు. ఆఖరికి అర్జున్ రామ్ పాల్ ఇప్పుడు బాలయ్యతో ఢీ కొట్టబోతున్నాడు. హిందీ సినిమాలు బాగా చూసేవారికి అర్జున్ రామ్ పాల్ సుపరిచితుడే. 2001లో తెరంగేట్రం చేసిన అతడు, తర్వాత దూకుడు చూపించలేక వేగం తగ్గించి, ఇప్పుడు బాలయ్య సినిమాకు డేట్లు ఇచ్చాడు. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్, ఓ కీలక పాత్రలో శ్రీలీల చేస్తున్న ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. పటాస్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమా కాబోతుందని అందరూ అనుకుంటున్నారు. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.













