విజయ్‌పై కంప్లైంట్ చేస్తూనే గొడవకు ఫుల్ స్టాప్
యాంకర్, నటి అనసూయకు హీరో విజయ్ దేవరకొండతో ఉన్న గొడవ గురించి తెలిసిందే. విజయ్ ఈ విషయంలో ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు కానీ అనసూయ మాత్రం కొన్నేళ్లుగా విజయ్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ టైమ్ లో మొదలైన ఈ వివాదం, ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది అనసూయ.
రీసెంట్గా ఖుషి పోస్టర్ లో తన పేరుకు ముందు ‘the’ అని పెట్టుకోవడాన్ని ఆమె తప్పుబడుతూ మరోసారి వివాదాన్ని లేవనెత్తింది అనసూయ. ఈసారి అనసూయ విజయ్ ను టార్గెట్ చేయడం వల్ల చాలా మంది ఆమెను తప్పుబట్టారు. విజయ్ ఫ్యాన్సే కాదు సదరు మూవీ లవర్స్ కూడా ఆమెను ఈ విషయంలో వెనుకేసుకుని రాకపోగా అనసూయదే తప్పని చెప్పారు.
దీంతో రీసెంట్గా అనసూయ ఈ విషయమై స్పందించి, తన ప్రాబ్లమ్ గురించి వివరిస్తూనే, ఈ గొడవకు ఇక్కడితో ఫుల్ స్టాప్ చెప్పబోతున్నట్లు చెప్పుకొచ్చింది. విజయ్ తను మంచి ఫ్రెండ్స్ అని, అర్జున్ రెడ్డి రిలీజ్ టైమ్ లో సెన్సార్ వాళ్లు కొన్ని పదాలను మ్యూట్ చేస్తే, విజయ్ ఆ పదాలను ఫ్యాన్స్ తో చెప్పించాడని, ఓ తల్లిగా ఈ పదాలు తననెంతో బాధించాయని, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని విజయ్ కు చెప్పినా వినలేదని, తర్వాత తనపై ఆన్ లైన్ లో ట్రోల్స్ మొదలైనట్లు ఆమె తెలిపింది.
అంతేకాదు, విజయ్ కు సంబంధించిన ఓ వ్యక్తి తనను ట్రోల్ చేయడానికి చాలా మందికి డబ్బులిస్తున్నట్లు తెలిసి షాక్ అయినట్లు ఆమె చెప్పింది. ఇదంతా విజయ్ కు తెలియకుండా ఉండదని, విజయ్ కు తన మీద ద్వేషముందోమోనని అనుమానం వ్యక్తం చేసింది అనసూయ. దీంతో పాటూ తను మాత్రం దీన్ని ఇక్కడితో ఆపేసి మానసిక ప్రశాంతత కోరుకుంటున్నట్లు అనసూయ వివరించింది.













