50 ఏళ్ళ సినీ జీవితం.. 47 ఏళ్ళ వైవాహిక జీవితం
అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. అజాత శత్రువుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ చెప్పుకునే అమితాబ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1969లో `సాత్ హిందుస్థానీ` చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన అమితాబ్ 77 సంవత్సరాల వయసులో ఇప్పటికీ ఎంతో చలాకీ సినిమాలు చేస్తున్నారు, టీవీ షోలలో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో అన్ని విషయాలను షేర్ చేసుకునే అమితాబ్ 1973లో నటి జయబాధురిని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె జయా బచ్చన్‌గా మారిపోయింది. వీరిద్దరూ కలిసి అభిమాన్, సిల్సిలా, మిలి, చుప్కే చుప్కే, జంజీర్ వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు. జూన్ 3(బుధవారం) అమితాబ్, జయా బచ్చన్ల 47వ పెళ్లిరోజు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ తమ పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేశారు.
ఈ సందర్భంగా వారి పెళ్లికి ముందు జరిగిన ఓ సంఘటనను అభిమానులతో షేర్ చేసుకున్నారు అమితాబ్. `జంజీర్` చిత్రం అమితాబ్ కెరీర్లో ఓ మైల్ స్టోన్‌లాంటి సినిమా. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ జయబాధురితోపాటు మరికొందరు స్నేహితులతో కలిసి లండన్ వెళ్లాలనుకున్నారు. ఆ సమయంలో అమితాబ్ తండ్రి `లండన్ ఎవరితో కలిసి వెళుతున్నావు` అని అడిగారట. దానికి అమితాబ్ `జయతో కలిసి వెళుతున్నాను` అని చెప్పారట.
`అయితే ఆమెను పెళ్లి చేసుకొని తీసుకెళ్లు.. లేకపోతే వెళ్లొద్దు` అని చెప్పడంతో వెంటనే జయతో పెళ్లికి రెడీ అయిపోయాడు అమితాబ్. అలా తమ పెళ్లి జరిగిందని ట్వీట్ చేశాడు. అమితాబ్, జయలకు ఇద్దరు పిల్లలు. అభిషేక్ బచ్చన్ హీరోగా రాణిస్తుండగా, కుమార్తె శ్వేతా నందా వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.













