భారతసైన్యంలో చేరుతున్నా
నా పేరు సూర్య చిత్రీకరణ కోసం ఆర్మీ క్వార్టర్లకి వెళ్లినపుడు అక్కడి వాతావరణం, ఆ జీవితాలను చూసి భారత సైన్యంలో చేరాలని అనిపించింది. దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు ఆమోదం తెలుపగానే గౌరవ సభ్యుడిగా సైన్యంలో చేరబోతున్నా అని హీరో అల్లు అర్జున్ తెలిపారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని ఆర్మీ అధికారులతో కలిసి ఆయన వీక్షించారు. నా కెరీర్లో గర్వపడే సినిమా ఇది. ఈ చిత్రాన్ని నిజమైన ఆర్మీ వాతావరణంలో చిత్రీకరించాం. మా తపనకి సహకారం అందించిన సైన్యానికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు చాలా సినమాల్లో నటించాను. ఒక సినిమా విజయవంతమైతే పేరొస్తుంది, డబ్బొస్తుంది. వాటిని మించి ఈ సినిమాతో నాకు చాలా గౌరవం లభించింది అన్నారు. రియల్ హీరోస్ మధ్య ఈ చిత్రాన్ని చూడడం ఆనందంగా ఉందని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. సైనికుల జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మా దర్శకుడు. పాత్రలో జీవించారు మా హీరో అల్లు అర్జున్. మా సంస్థ గర్వించదగిన చిత్రమిది అన్నారు.













