అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ‘ICONZA’ కు శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్!
నటనా పరిధిని దాటి సరికొత్త సృజనాత్మక ప్రయాణానికి నాంది
సుప్రసిద్ధ నటుడు అల్లు రామలింగయ్యగారి జయంతి సందర్భంగా ఐకాన్ స్టార్ వేసిన అడుగుకు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐకాన్
స్టార్ అల్లు అర్జున్ తన సృజనాత్మక ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో తన కొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను ప్రారంభించారు.
సరికొత్త ఆలోచనలు, అద్భుతమైన సృజన, పరస్పర సహకారానికి, సంయుక్త కార్యాచరణకు వేదికగా ‘ICONZA’ను తీర్చిదిద్దుతున్నారు. ఈ నూతన ప్రయాణాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అత్యంత ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో మొదలుపెట్టినట్టు ఐకాన్ స్టార్ గ్లింప్స్ షేర్ చేసి తెలిపారు.
నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, ‘ICONZA’ ద్వారా నటనా పరిధిని దాటి, తన సృజనాత్మక దృష్టిని మరింత విస్తరించనున్నారు. కొత్త ఆలోచనలు, కళాత్మక భాగస్వామ్యాలు, విభిన్న సృజనాత్మక వెంచర్లకు ఈ వేదిక కేంద్రంగా నిలవనుంది. తన కెరీర్లో మరింత విస్తృతమైన, వైవిధ్యభరితమైన కొత్త అధ్యాయానికి ‘ICONZA’ నాంది పలుకుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి వార్తల్లో నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘AA23’లో అల్లు అర్జున్ నటించనున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’తో పాటు మరికొన్ని భారీ క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి.








