కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య బిగ్‌బాస్ సీజన్ 4కు రంగం సిద్ధం?
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 4 త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా తీవ్రతను బట్టి అసలు షో ఉండే అవకాశం లేదని అందరూ భావించారు. కానీ, కరోనా బారిన ఎవరూ పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని షో నిర్వహించేందుకే బిగ్‌బాస్ టీమ్ రెడీ అవుతోంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కి, టెక్నీషియన్స్‌కి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా షో ప్రారంభానికి 15 రోజుల ముందే అందర్నీ క్వారంటైన్ ఉంచబోతున్నారు. దీంతో కరోనా బిగ్‌బాస్ హౌస్ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కరోనా నిబంధనల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇక హోస్ట్‌గా వ్యవహరించబోయే నాగార్జున కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోనున్నారు. సెట్లో నాగార్జునను ఎవరూ కలుసుకోవడానికి వీల్లేదు. మేకప్ మేన్ తప్ప నాగార్జున దగ్గర ఎవ్వరూ ఉండబోరు. సెట్లో ఎప్పుడూ ఒక హెల్త్ టీమ్ ఉంటుంది. వారు ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తుంటారు. అప్పుడప్పుడు పరీక్షలు చేస్తూ ఎలర్ట్‌గా ఉంటారు. ఇన్ని జాగ్రత్తల మధ్య షో నిర్వహించడం పెద్ద కష్టమైన పని కాదని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కంటెస్టెంట్లు, బిగ్‌బాస్ టీమ్ అంతా కరోనా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. అయితే సీజన్ 4 ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే తెలియజేస్తామని నిర్వాహకులు అంటున్నారు.













