నిర్ణయాన్ని మార్చుకున్న అఖిల్
అక్కినేని అఖిల్ నుంచి ఏజెంట్ సినిమా వచ్చి ఇప్పటికే సంవత్సరం నాలుగు నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు తన తర్వాతి సినిమాను మొదలుపెట్టింది లేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ధీర అనే ఫాంటసీ సినిమాను అనుకున్నారు కానీ అది ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.
దీంతో ఈ సినిమా విషయంలో పలు డౌట్స్ తలెత్తాయి. అసలీ సినిమా ఉందా క్యాన్సిల్ అయిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ధీర క్యాన్సిల్ కాలేదు కానీ బడ్జెట్ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయట. దానికి తోడు స్క్రిప్ట్ కూడా ఇంకా లాకవలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల్ డెసిషన్స్ లో కొన్ని కీలక మార్పులు జరుగుతున్నట్లు సమాచారం.
వినరో భాగ్యము విష్ణుకథతో మెప్పించిన మురళీకృష్ణ అబ్బూరు ఇప్పటికే అన్నపూర్ణ టీమ్ కు ఓ కథ వినిపించి మెప్పించాడని, ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పుడా కథతోనే అఖిల్ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. లెనిన్ పూర్తయ్యాకే ధీర తాలూకు వ్యవహారం చూద్దామని అఖిల్ డిసైడయ్యాడట. మరి ధీర కోసం అఖిల్ తన గెటప్ ను చాలా వరకు మార్చాడు. లెనిన్ లో అదే గెటప్ తో కనిపిస్తాడా లేక మళ్లీ మేకోవర్ చేస్తాడా అనేది చూడాలి.













