రవితేజ తప్పుకున్నాడు… ఇద్దరు హీరోలు వచ్చి చేరారు!
సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారుతూ ఉంటుంది. దాన్ని గుర్తించి వారి అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీసే డైరెక్టర్లే విజయాలు అందుకుంటారు. అలాంటి డైరెక్టర్స్‌లో అజయ్‌భూపతి ఒకరు. ప్రేమించి మోసం చేసిన అమ్మాయి, ఆ అమ్మాయిపై పగ తీర్చుకోవాలనుకునే ఓ భగ్న ప్రేమికుడు.. ఇలా ఓ విభిన్నమైన కథతో, కట్టిపడేసే కథనంతో అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ ఎక్స్ 100 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాతోపాటు పాటల్ని కూడా పెద్ద హిట్ చేశారు. అంత పెద్ద హిట్ ఇచ్చిన అజయ్ ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా మరో సినిమా మొదలుపెట్టలేదు. ఆమధ్య మహాసముద్రం అనే సినిమా చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌లో చాలా బిజీగా ఉన్నానని చెప్పాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అజయ్‌కి, రవితేజకి మధ్య వచ్చిన మనస్పర్థలే దానికి కారణం అని తెలిసింది.
తాజాగా అజయ్ ఈ సినిమా కోసం ఇద్దరు యంగ్ హీరోలను ఎంపిక చేశాడని సమాచారం. ఒకరు శర్వానంద్ కాగా, మరొకరు ఆర్ ఎక్స్ 100లో హీరోగా నటించిన కార్తికేయ. రవితేజ ఈ సినిమా నుంచి తప్పుకున్నప్పటి నుంచి శర్వానంద్ ఈ సినిమా చేయబోతున్నాడని బాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కార్తికేయ పేరు కూడా వినిపిస్తోంది. ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్‌గా తెరకెక్కే ఈ సినిమా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలు, కావాల్సినన్ని ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. తన రెండో సినిమాని ఓ రేంజ్లో తెరకెక్కించేందుకు అజయ్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడని, వీలైనంత త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడని తెలుస్తోంది.













