అఖిల్ మీద పెద్ద భారమే!
అక్కినేని వారసుడు తన మొదటి చిత్రం అఖిల్ కు ముందు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. తెలుగులో ఓ డెబ్యూ హీరోకి ఈ రేంజ్ తెరంగేట్రం ఎవరికీ జరగలేదు అనే రీతిలో అఖిల్ లాంఛ్ అయ్యాడు. బడ్జెట్, ఓపెనింగ్స్ ఇలా ఎన్నో విషయాల్లో అఖిల్ సినిమా గురించి అందరూ అమ్మో అనుకున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత టాలీవుడ్‌కు మరో సూపర్ స్టార్ రాబోతున్నాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు.
కానీ సినిమా రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అందరి అంచనాలు తారుమారయ్యాయి. అఖిల్ మూవీ డిజాస్టర్ అవడంతో తర్వాతి సినిమాకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. ఆ తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను కూడా ఏమంత గొప్ప ఫలితాన్నివ్వలేదు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అఖిల్ కు అందించింది.
దీంతో అనిల్ సుంకర అఖిల్ తో ఓ పెద్ద సాహసానికి రెడీ అయిపోయి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాను అనౌన్స్ చేశాడు. మొదట్లో ఈ సినిమా బడ్జెట్ రూ.50 కోట్ల అని తెలియడంతో అందరూ షాకయ్యారు. అఖిల్ చేస్తున్న మాస్ మూవీకి, సురేందర్ రెడ్డి డైరెక్టర్ కాబట్టి ఎలాగోలా వర్కవుట్ అవుతుందిలే అనుకున్నారు కానీ ఇప్పుడు ఏజెంట్ గురించి అనిల్ సుంకర చెప్తున్న విషయాలు వింటే అందరికీ మతి పోతుంది.
ఈ సినిమాను అనిల్ సుంకర 80 కోట్లు పెట్టి తీసినట్లు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీంతో అఖిల్ ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడమేంటనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే అనిల్ సుంకర మాత్రం ఈ సినిమాతో అఖిల్ స్థాయి మారుతుందని, బాహుబలికి ముందు ప్రభాస్, తర్వాత ప్రభాస్ ఎలానో, ఏజెంట్ తర్వాత అఖిల్, ఏజెంట్ ముందు అఖిల్ స్థాయి వేరు అని వ్యాఖ్యానిస్తున్నాడు. ఇదిలా ఉంటే 80 కోట్ల భారాన్ని అఖిల్ ఎంతవరకు మోస్తాడని సినీ విశ్లేషకులు అనుకుంటున్నారు.













