Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోటా 750కిపైగా చిత్రాల్లో నటించారు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తొమ్మిది నది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం (Padma Shri Award) అందించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కోటా ప్రసాద్ ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డుప్రమాదంలో ప్రసాద్ మృతిచెందారు.
1942 జులై 10న కృష్ణాజిల్లా (Krishna District) కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచి నాటకాలంటే చాలా ఆసక్తి కనబడిరిచేవారు. 1978లో ప్రాణం ఖరీదు తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. కోట శ్రీనివాసరావుకు దర్శక నిర్మాత క్రాంతికుమార్ తొలి అవకాశం ఇచ్చారు. తన నటన, డైలాగ్ డెలివరీతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికంౌ ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు.
సినిమాల్లోకి రాకముందు స్టేట్‌బ్యాంకులో పనిచేశారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీ (BJP) లో చేరిన ఆయన 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే (MLA) గా పనిచేశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2023లో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్నా, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్రసీమ ఓ గొప్ప గుణచిత్ర నటుడిని కోల్పోయినట్టు అయ్యింది. కోటా మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.