శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్సీ మ్యాజిక్.. ఐపీఎల్లో సంచలన ఫామ్..!
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ఆకాశమే హద్దుగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా నిన్న ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS) కెప్టెన్‌గా అతను ఆడిన తీరుకు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఒత్తిడిలోనూ 35 బంతుల్లోనే 66 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, మైదానంలో అతను తీసుకున్న నిర్ణయాలు పంజాబ్ విజయానికి బాటలు వేశాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన అయ్యర్, 203 పరుగులతో బ్యాటర్ల జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ కేవలం బ్యాటర్‌గానే కాకుండా, కెప్టెన్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను.. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ను.. ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఏకైక సారథిగా అతను రికార్డు సృష్టించాడు. 2024 లో కేకేఆర్ (KKR)కు టైటిల్ అందించినప్పటికీ, భారత వైట్-బాల్ (T20, ODI) జట్లకు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలకడైన ప్రదర్శన, వ్యూహాలను అమలు చేయడంలో అయ్యర్ ప్రస్తుత కెప్టెన్ల కంటే మెరుగ్గా ఉన్నాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ లాంటి భారీ టోర్నీలో నిరంతరం రాణిస్తున్న అయ్యర్‌ను పక్కనపెట్టి, ఇతర ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం వెనుక కారణాలేంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ కూడా మాట్లాడుతూ, అయ్యర్ నాయకత్వానికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదని, అతను టీమ్ ఇండియాకు నాయకత్వం వహించడానికి పూర్తి అర్హుడని పేర్కొన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను(Hardik pandya) పెవిలియన్ పంపిన ఆ రిలే క్యాచ్, అయ్యర్ మైదానంలో ఎంత ఏకాగ్రతతో ఉంటాడో నిరూపించింది.
ప్రస్తుతం టీమ్ ఇండియా వైట్-బాల్ కెప్టెన్సీ విషయంలో సెలెక్టర్లు ఒక పక్కా ప్రణాళికతో లేకపోవడం అయ్యర్‌కు కలిసొచ్చే అంశం. రాబోయే వరల్డ్ కప్ నేపథ్యంలో, నిలకడైన ఫామ్, విజయవంతమైన కెప్టెన్సీ రికార్డు ఉన్న అయ్యర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నిన్నటి 66 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత, అయ్యర్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అతను తన ఆటతో సమాధానం చెబుతుంటే, సెలెక్టర్లు మాత్రం ఇంకా మౌనంగానే ఉండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి








