ట్రంప్‌కు కొండంత అండగా ఉన్న మిల్లరే.. ఇప్పుడు కొంప ముంచబోతున్నారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారీ ఆయనకు అండగా నిలిచే వ్యక్తుల్లో స్టీఫెన్ మిల్లర్ పేరు ముందుంటుంది. వలసదారులపై కఠినంగా వ్యవహరించడం, వారిని అమెరికా సమస్యలకు కారణంగా చూపించడం వంటి రాజకీయ వ్యూహాల్లో మిల్లర్‌ది కీలక పాత్ర. గతంలో ఈ వ్యూహాలు ట్రంప్‌కు రాజకీయంగా బాగానే కలిసొచ్చాయి. అందుకే ఇప్పుడు కూడా అదే అస్త్రాన్ని బయటకు తీస్తే తనకు ఎదురవుతున్న సమస్యలన్నీ సమసిపోతాయని ట్రంప్ భావిస్తున్నారట. కానీ ఈసారి మాత్రం కథ అలా ముగిసేలా లేదని అంటున్నారు ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్ట్ జీన్ గెరెరో. ట్రంప్‌ను గట్టెక్కించాల్సిన మిల్లరే చివరికి ఆయనకు కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉందని ఆమె విశ్లేషిస్తున్నారు.
2020లో Hatemonger అనే పుస్తకంతో స్టీఫెన్ మిల్లర్ రాజకీయ భావజాలం, వలసలపై ఆయన అనుసరించిన కఠిన వైఖరిని లోతుగా పరిశీలించిన జీన్ గెరెరో.. ట్రంప్, మిల్లర్ రాజకీయ సంబంధాలపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వలసదారులను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాలు పొందే వ్యూహం గతంలో పనిచేసి ఉండొచ్చు కానీ, ఇప్పుడు అమెరికా ప్రజలు ఆ విధానాలతో విసిగిపోయారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
వలసదారులపై కఠిన వైఖరి.. ఇప్పుడు అమెరికన్లకే నష్టమా?
వలసదారులను దేశం నుంచి పంపించేస్తే అమెరికా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉందని గెరెరో చెబుతున్నారు. ఎందుకంటే వలసదారులపై తీసుకుంటున్న చర్యల ప్రభావం కేవలం వారికే పరిమితం కావడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న అనేక రంగాలు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఉదాహరణకు, ఇప్పటికే ఇళ్ల కొరతతో సతమతమవుతున్న అమెరికాలో నిర్మాణ రంగానికి అవసరమైన కార్మికులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని నిర్మాణ పనులు నిలిచిపోతున్నాయి. వ్యవసాయ రంగంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పొలాల్లో పనిచేసే కార్మికులు లేక పంటలు కోతకు రాకుండానే పాడైపోతున్నాయి. మరోవైపు ఆహార ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై భారం పడుతోంది.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్న అమెరికా జనాభాలో వృద్ధుల సంరక్షణ కోసం కూడా వలసదారుల సేవలు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వారిని పెద్ద సంఖ్యలో దేశం నుంచి పంపించేస్తే ఆ ప్రభావం చివరికి అమెరికా కుటుంబాలపైనే పడుతుంది. అందుకే వలసదారులపై జరుగుతున్న పోరాటం పరోక్షంగా అమెరికన్ల జీవితాలపైనా ప్రభావం చూపుతోందని ప్రజలు క్రమంగా అర్థం చేసుకుంటున్నారని గెరెరో అంటున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే.. వలసదారులపై చేస్తున్న యుద్ధం చివరికి అమెరికన్లపైనే జరుగుతున్న యుద్ధంగా మారుతోంది.
ట్రంప్‌కు ప్రజల మెప్పు కావాలి.. మిల్లర్‌కు మాత్రం అది అవసరం లేదా?
ట్రంప్‌కు రాజకీయంగా ప్రజల మద్దతు చాలా ముఖ్యం. ప్రజలు తనను ఎలా చూస్తున్నారు? తన విధానాలకు ఎంత ఆదరణ ఉంది? ఎన్నికల్లో ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే విషయాలను ఆయన ఎప్పుడూ లెక్కలోకి తీసుకుంటారు. కానీ మిల్లర్‌కు అలాంటి ఆలోచనలు పెద్దగా ఉన్నట్లు కనిపించదు. ప్రజల నుంచి ప్రశంసలు పొందాలన్న ఆసక్తి కంటే తన రాజకీయ సిద్ధాంతాలను అమలు చేయడంపైనే ఆయనకు ఎక్కువ ఆసక్తి ఉందని గెరెరో అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు సమస్య ఏంటంటే.. మిల్లర్ సూచిస్తున్న వలస విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ట్రంప్‌కు అర్థమైతే, ఆయన తన వైఖరిని మార్చుకోవాల్సి రావచ్చు. అదే జరిగితే ఇన్నాళ్లూ ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న మిల్లర్తోనే విభేదాలు మొదలయ్యే అవకాశం ఉందని గెరెరో చెబుతున్నారు. అంటే ట్రంప్‌ను కాపాడటానికి మిల్లర్ అనుసరిస్తున్న వ్యూహమే చివరికి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచవచ్చన్నమాట.
వలసదారులకు పౌరసత్వం కల్పించే బిల్లు వస్తే అసలు కథ మొదలవుతుందా?
ట్రంప్, మిల్లర్ మధ్య విభేదాలు ఎంతవరకు వెళ్లవచ్చో చెప్పడానికి గెరెరో ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామాన్ని ప్రస్తావించారు. కొత్త కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వలస కార్మికులకు పౌరసత్వం కల్పించే మార్గాన్ని సూచిస్తూ ఒక బిల్లును తీసుకొస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చని ఆమె అంటున్నారు. దేశ నిర్మాణం, వ్యవసాయం వంటి రంగాలకు అవసరమైన కార్మికులను కాపాడుకోవాలంటే వారికి చట్టబద్ధమైన గుర్తింపు కల్పించడం అవసరమనే వాదనతో ఈ ప్రతిపాదన ముందుకు రావచ్చు.
ఒకవేళ అలాంటి బిల్లు ట్రంప్ ముందుకు వచ్చి, ఆయన దానికి అంగీకరించి సంతకం చేస్తే మాత్రం అది మిల్లర్‌కు పెద్ద రాజకీయ ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ఇన్నాళ్లూ ఆయన సమర్థించిన కఠిన వలస విధానాలకు ఇది భిన్నమైన నిర్ణయం అవుతుంది. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వలసల విషయంలో మెత్తబడితే, మిల్లర్ తన సిద్ధాంతాలను పక్కనపెట్టి ఆయన వెంట నడుస్తారా? లేక తన నమ్మకాలకే కట్టుబడి ఉంటారా? అన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఈ పరిణామం ట్రంప్, మిల్లర్ మధ్య అసలైన రాజకీయ డ్రామాకు తెరతీయవచ్చని గెరెరో అభిప్రాయపడ్డారు.
మిల్లర్లోనే రెండు మనస్తత్వాల మధ్య పోరాటం!
స్టీఫెన్ మిల్లర్ పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చే అంశం ఆయన వ్యక్తిత్వమేనని గెరెరో చెబుతున్నారు. ఒకవైపు తన రాజకీయ సిద్ధాంతాల విషయంలో చాలా పట్టుదలగా ఉండే వ్యక్తి.. మరోవైపు ట్రంప్‌కు అత్యంత విధేయుడిగా కనిపించే సహాయకుడు. ఈ రెండు కోణాలే భవిష్యత్తులో ఆయనకు పెద్ద సమస్యగా మారవచ్చని ఆమె విశ్లేషిస్తున్నారు. రాజకీయ సిద్ధాంతాలను నమ్మే వ్యక్తిగా తన అభిప్రాయాలను వదులుకోవడం మిల్లర్‌కు అంత సులభం కాకపోవచ్చు. అదే సమయంలో ట్రంప్‌కు ఇన్నాళ్లూ చూపించిన విధేయతను కూడా ఒక్కసారిగా పక్కనపెట్టలేరు.
ట్రంప్ వలసల విషయంలో తన వైఖరిని మార్చుకుంటే మిల్లర్ ఏం చేస్తారన్నదే అసలు ప్రశ్న. అధ్యక్షుడి నిర్ణయానికి తలొగ్గుతారా? లేక తన సిద్ధాంతాల కోసం ట్రంప్‌తోనే విభేదిస్తారా? ఈ రెండు వైపులా ఆయనకు ఇబ్బందే. ట్రంప్ పట్ల తన విధేయతను కొనసాగించాలా? లేక తాను నమ్మిన రాజకీయ భావజాలానికి కట్టుబడి ఉండాలా? అనే అంతర్గత సంఘర్షణ ఆయనలో మొదలయ్యే అవకాశం ఉందని గెరెరో అంటున్నారు.
వైట్‌హౌస్ మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది!
జీన్ గెరెరో చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ కూడా ఘాటుగానే స్పందించింది. ఆమె డెమోక్రటిక్ పార్టీకి నమోదైన మద్దతుదారని, ట్రంప్‌ను, ఆయన అనుచరులను ఫాసిస్టులు, నాజీలు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శిస్తుంటారని వైట్‌హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ పేర్కొన్నారు. అందువల్ల ఆమె వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోరని విమర్శించారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







