యాంటి వైరల్ దుస్తులొచ్చేశాయ్…

రసాయనాలు లేకుండా ఆరోగ్యకరం అంటూ ఆర్గానిక్ దుస్తులొచ్చి ఇప్పుడిప్పుడే మార్కెట్లో చాలా మందికి దగ్గరవుతున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభణతో వ్యాధిని ఎదుర్కునేందుకు అనువైన దుస్తుల్ని కూడా తయారు చేసేస్తోంది వస్త్ర ప్రపంచం. దుస్తులనే అస్త్రాలుగా మార్చి కరోనాతో తలపడమంటోంది.
ఫ్యాబ్రిక్…ప్రొటెక్ట్…
దుస్తుల అందంలో ప్రధాన పాత్ర పోషించేదీ, ధరించిన వారికి సౌకర్యవంతంగా ఉండేలా చేసేదీ అందులో వినియోగించిన ఫ్యాబ్రిక్. ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా ఉండే ఫ్యాబ్రిక్‌ని ఇప్పుడు ప్రొటెక్షన్ జత చేస్తున్నారు దుస్తుల రూపకర్తలు.
యాంటి వైరల్…కాదు నార్మల్…
గత నెలలో భారతదేశానికి చెందిన నందన్ డెనిమ్ లిమిటెడ్ సంస్థ న్యూ నార్మల్ యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరస్ ట్రీటెడ్ డెనిమ్స్‌ని లాంచ్ చేసింది. భారతదేశంలో తొలి యాంటి వైరల్ ఫ్యాబ్రిక్ ఇదేనని చెప్పొచ్చు. ఈ ఉత్పత్తిని ఒక వ్యాపార మార్గంగా మాత్రమే చూడడం లేదని ఈ విపత్కర సమయంలో సమాజానికి తమ వంతు సేవగా భావిస్తున్నామని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలనే ఈ ఉత్పత్తి తయారు చేశాం అని నందన్ డెనిమ్ లిమిటెడ్ ప్రతినిధులు అంటున్నారు. ఇదే క్రమంలో మరో కంపెనీ యాంటి వైరస్,యాంటి బ్యాక్టీరియా థెరపీతో ప్రొటెక్టివ్ టెర్రీ టవల్స్‌ని అందిస్తోంది.
టెక్నాలజీ ఫ్రమ్ స్విస్…
ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్యాబ్రిక్‌కి జత చేసే యాంటి వైరల్ టెక్నాలజీని స్విస్ టెక్స్‌టైల్ కంపెనీ హైక్యు మెటీరియల్స్, తైవాన్‌కు చెందిన జింటెక్స్ కార్పొరేషన్‌లతో కలిసి కొత్త టెక్నాలజీకి ఊపిరిపోసింది. ఈ సందర్భంగా అరవింద్ లిమిటెడ్ ఇడి క్యులిన్ లాల్‌భాయ్ మాట్లాడుతూ ‘‘అనూహ్యమైన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితుల్లో…మా వినియోగదారుల ఆరోగ్యం దృష్ట్యా హైక్యూతో ఒప్పందం పెట్టుకుని వైరో బ్లాక్ టెక్నాలజీని భారత్‌కు అందించనున్నాం. ఈ టెక్నాలజీతో రూపొందిన దుస్తులు త్వరలోనే హైదరాబాద్ సహా భారతదేశంలోని అన్ని నగరాల్లో మా ఇంటెల్లి ఫ్యాబ్రిక్స్ బ్రాండ్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఇవి యాంటి వైరల్‌గా పనిచేయడం మాత్రమే కాకుండా అత్యాధునిక ఫ్యాషన్లకు పట్టం కట్టేలా కూడా ఉంటాయి’’ అని వివరించారు.
వస్త్రం…వైరస్‌కు వేదిక…
వైరస్‌లు, బాక్టీరియా వస్త్రాల ఉపరితలంపై కొంత సమయం చురుకుగానే ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం నిమిషాలు, గంటలు మాత్రమే కాదు దాదాపు 2 రోజుల వరకూ ఇవి వస్త్రాలపై ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో ఫ్యాషన్ ప్రియుల కోసం యాంటి వైరల్ ఫ్యాబ్రిక్స్ ఆవిష్కృతమయ్యాయి. హైక్యు వైరోబ్లాక్ తో తయారైన దుస్తులు ఈ వైరస్‌ను చంపేస్తాయి. తద్వారా దుస్తుల ద్వారా వ్యాధుల వ్యాప్తిని నిరోధిస్తాయి.
హైక్యు వైరోబ్లాక్…
స్విస్ టెక్స్‌టైల్ సంస్థ హైక్యు అందిస్తున్న అంతర్జాతీయ యాంటి వైరల్ ఉత్పత్తులో ఈ హైక్యు వైరోబ్లాక్ ఒకటి. దీని ద్వారా 99.99 శాతం వరకూ వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. అయితే ఇది దుస్తులను వాష్ చేసే ప్రక్రియ ద్వారా క్రమక్రమంగా తన ప్రభావాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. అయితే 30 తేలికపాటి,డొమెస్టిక్ వాష్‌ల వరకూ టెక్నాలజీ ప్రభావం చురుకుగానే ఉంటుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు.
ధరలిలా…
ఫ్యాబ్రిక్ తయారీ పూర్తవుతున్న చివరి దశలో ఓ సాంకేతిక ప్రక్రియ ద్వారా హైక్యు టెక్నాలజీని అనుసంధానం చేస్తారని సమాచారం. మరి దీని ఆధారంగా తయారైన దుస్తులు ధరలెలా ఉండొచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం అధికారికంగా లేనప్పటికీ… కొంత వరకూ ఖరీదుగానే ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు ఫ్యాషన్ రంగ ప్రముఖులు. ఈ టెక్నాలజీతో రూపొందిన షర్ట్/ట్రౌజర్‌ల రూ.2500 వరకూ ఉండొచ్చునని కేవలం ఫ్యాబ్రిక్ వరకూ మాత్రమే కొనుగోలు చేయాలంటే మీటర్ రూ. 600 నుంచి రూ.1000 వరకూ ఉండొచ్చని అంచనా. సో…మరికొన్ని రోజుల్లో భారతీయ మార్కెట్లో సందడి చేసే ఈ యాంటి వైరల్ ఫ్యాబ్రిక్ డిజైన్స్‌ని యూత్ ధరించి ధైర్యంగా తిరగొచ్చునన్నమాట…