తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా
తెలంగాణాలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగును తప్పనిసరిగా బోధించేటట్లు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ సమావేశ మందిరంలో 1972వ సంవత్సరం గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల పూర్వ విద్యార్థుల మిత్రమా స్వాగతం సంస్థ ఏర్పాటు చేసిన సత్కార సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. పిల్లలకు తెలుగు నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని లక్ష్మీప్రసాద్ అన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే మన సంస్కృతి, మన అస్తిత్వానికి మనుగడ కష్టమని ఆయన హెచ్చరించారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యార్లగడ దంపతులను ఘనంగా సత్కరించారు.













