మళ్లీ వార్తల్లోకి ట్రంప్ గ్రామం
హర్యానాలో ట్రంప్ విలేజ్‌గా గుర్తింపు పొందిన మరోరా గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినం సందర్భంగా ఈ గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద టాయిలెట్ పాట్‌ను ఆవిష్కరించారు. మరుగుదొడ్ల వినియోగం, పరిశుభ్రతపై అవగాహన తెచ్చేందుకు దీన్ని రూపొందించారు. ఇనుము, ఫైబర్, చెక్క, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగించి ఈ టాయిలెట్ పాట్‌ను తయారు చేశారు. 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో దీన్ని రూపొందించారు. 1800 మంది జనాభాతో ఈ ఏడాది జూన్ వరకు అంతగా గుర్తింపు లేని ఈ గ్రామం, ట్రంప్ విలేజ్ అని పేరు పెట్టగానే ప్రపంచం మొత్తానికి పరిచయమైపోయింది. వాషింగ్టన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన సందర్భంగా ఎన్జీవో సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ మేవాట్ ప్రాంతంలోని ఈ గ్రామాన్ని ట్రంప్ విలేజ్‌గా ప్రకటించింది. అయితే గ్రామం పేరు మార్చడం చట్ట వ్యతిరేకం అంటూ నహ్ జిల్లా యంత్రాంగం ఆదేశించడంతో సదరు సంస్థ సభ్యులు కొత్తపేరుతో ఉన్న బోర్డులు తొలగించాల్సి వచ్చింది.













