ఎయిర్ కార్గో సేవల విస్తరణకు కృషి
దేశంలో ఎయిర్ కార్గో సేవలు మెరుగుపరచడం ద్వారా దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించే అవకాశం ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. ఆదివారం ఆయన డెంకాడలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఎయిర్ కార్గో సేవలపై గతంలో అంతగా దృష్టిసారించలేదన్నారు. కేవలం విమాన ప్రయాణికులపై ఆధారపడితే ఆ రంగం అభివృద్ధి సాధించలేదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో భారత్‌లోనే విమాన ప్రయాణికుల వృద్ధిరేటు అధికంగా ఉందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్లను ఖరారు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. మరో మూడేళ్లలో విమానాశ్రయం రూపుదిద్దుకోనుందన్నారు. నిర్మాణం పూర్తయితే స్థానికులకు ఉపాధి లభించనుందన్నారు.













