హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావొచ్చు
ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అభిప్రాయపడ్డారు. తెలుగు వర్సిటీలో యువకళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ల ఆధ్వర్యంలో డా.శ్రీధర్‌రెడ్డి రచించిన శ్రీధర్ కవితా ప్రస్థానం కవితా సంపుటి ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మళ్లీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుకోవడానికి ప్రయత్నం జరగాలని అభిలషించారు. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, రచయిత్రి ముక్తేవి భారతి, ప్రజాకవి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పని చేసిన విద్యాసాగర్ రావు ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













