ఐక్యతా ప్రతిమను (స్టాట్యూ ఆఫ్ యూనిటి) సందర్శించిన ఉపరాష్ట్రపతి
• భారతీయ తత్త్వానికి మరియు భావనకు ఐక్యతా ప్రతిమ చిహ్నమన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
• వల్లభభాయ్ పటేల్ దూరదృష్టి భారతదేశ ఐక్యత, సామరస్యాన్ని కాపాడింది
• సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసిన ఉపరాష్ట్రపతి
• మోడీ చొరవ, ముందు చూపుకు అభినందనలు తెలిపిన శ్రీ నాయుడు
ఈ రోజు గుజరాత్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కేవదీయ వద్ద ఉన్న ఐక్యతా ప్రతిమను (స్టాట్యూ ఆఫ్ యూనిటి) సందర్శించి, సర్దార్ పటేల్ స్మృతికి నివాళులు అర్పించారు. సర్దార్ పటేల్ విగ్రహం భారతదేశ ఐక్యతకు చిహ్నమని, వారి దూరదృష్టికి భారతజాతి వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. స్వరాజ్యం సంగ్రామ చరిత్రలో పటేల్ వంటి ఎంతో మంది మహనీయుల పాత్రను సరైన విధంగా ఆవిష్కరించలేదని, ఐక్యతా విగ్రహం అలాంటి అసమతౌల్యతను సరి చేస్తుందని అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ చూపిన చొరవ, దేశనిర్మాణంలో వారి క్రాంతదర్శనం మరచిపోలేనివని తెలిపారు. మొదటి ప్రధాని నెహ్రూకి, ఉపప్రధానిగా, హోంమంత్రిగా శ్రీ పటేల్ చేసిన సూచనలు నేటి కాలానికీ వర్తిస్తున్నాయని గుర్తు చేశారు. స్టాట్యూ ఆఫ్ యూనిటి సందర్శన అనంతరం సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి, దేశ చరిత్ర గురించి, ఉన్నతమైన భారతమాత పుత్రుడి గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని సందర్శించాలని అందులో తన అభిప్రాయాన్ని రాశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు చొరవ చూపిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడికి అభినందనలు తెలియజేశారు.
ఉపరాష్ట్రపతి మాటల్లోని ముఖ్యాంశాలు…
ఈ చారిత్రక ఐక్యతా ప్రతిమను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉంది. 182 మీటర్ల ఎత్తైన ఈ విగ్రం భారతదేశ ఏకత్వాన్ని సాకారం చేసిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ స్మృతి చిహ్నం.
బ్రిటీష్ వలస పాలకుల నుంచి స్వేచ్ఛను పొందేందుకు సుదీర్ఘమైన పోరాటం సాగించి, గుజరాత్ ముద్దుబిడ్డ మహాత్మ గాంధీ నేతృత్వంలో స్వరాజ్యాన్ని సముపార్జించుకోవడం దేశ చరిత్రలో ఓ మహోన్నత ఘట్టం. అంతే కాదు స్వాతంత్ర్యం తరువాత భారతదేశాన్ని ఏకీకృతం చేసిన నవీన భారత రూపశిల్పి కూడా ఇక్కడ వారే కావడం గర్వకారణం.
బ్రిటీష్ పాలకుల నుంచి స్వేచ్ఛను సముపార్జించడం దేశ ఆధునిక చరిత్రలో ఓ మైలు రాయి అయితే, 565 గణరాజ్యాలను ఒక్కటి చేయడం మరో కీలకమైన ఘట్టం. సర్దార్ వల్లభభాయ్ పటేల్ లేకుంటే ఈ 565 రాజ్యాల్లో చాలా వరకూ స్వతంత్ర దేశాలుగా ఉండిపోవలసి వచ్చేది. అప్పుడు భారత దేశ రూపం మరో రకంగా ఉండేది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా, ఈ రోజు మనమంతా చూస్తున్న విశాలమైన ఐక్యతా భారతాన్ని సాకారం చేయడంలో సర్దార్ పటేల్ చూపిన చొరవ మరచిపోలేనిది. ఒక్క ఏడాదిలో అన్ని గణ రాజ్యాలను ఏకం చేసి, భారత దేశ సాంస్కృతికి ఐక్యతను, సామరస్యాన్ని సర్దార్ పటేల్ కాపాడారు. బలమైన భారతదేశం సాకారం కావాలంటే, ముందుగా భారతదేశం ఏకం కావాలన్న వల్లభభాయ్ పటేల్ దూరదృష్టికి భారతజాతి వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుంది. ఈ ధైర్యం మరియు సంకల్పమే ఆయనను భారతదేశ ఉక్కుమనిషిని చేసింది.
నాతో సహా మరెంతో మంది తోటి పౌరుల దృష్టిలో ఈ విగ్రహం మరింత ఉన్నతమైన భావాన్ని కలిగిఉంది. దురదృష్టవశాత్తు స్వరాజ్య సంగ్రామం మరియు స్వాతంత్ర్యానంతరం భారతదేశ నిర్మాణ చరిత్రను ఉద్దేశపూర్వకంగా మరో కోణంలో వక్రీకరించి, ముందు తరాలకు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో సర్దార్ పటేల్ లాంటి ఎంతో మంది నాయకుల పాత్రను సరైన విధంగా చరిత్రలో ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు.
ఆధునిక భారతదేశ నిర్మాణంలో సర్దార్ పటేల్ దృష్టి, ధైర్యం, సామర్థ్యం మరియు సహకారాలను ఈ ఐక్యతా ప్రతిమ గుర్తు చేస్తుంది. ఈ విగ్రహం మనదేశ చరిత్ర అసమతుల్యతను సరి చేసే మార్గంగా చెప్పుకోవాలి. భారతదేశాన్ని ఏకతాటి మీదకు తేవడం మాత్రమే కాదు, ఈ ఏకీకరణను కొనసాగించడంలో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొంటూ సర్దార్ పటేల్ చేసిన పోరాటానికి ఈ విగ్రహాన్ని ఓ చిహ్నంగా చెప్పుకోవాలి. స్వాతంత్ర్య భారతదేశ ఐక్యతను సమర్ధిస్తూ, భారతరాజ్యాంగం పట్ల విధేయత చూపించే ప్రతి పౌరుడి బాధ్యత ఇది. భారతదేశ ఐక్యతా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ విగ్రహం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి, మన ఐక్యతను నిలబెట్టుకునే అమూల్యమైన పెట్టుబడి.
ఈ సందర్భంగా సర్దార్ పటేల్ క్రాంత దర్శనానికి ఓ ఉదాహరణను నేను గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్య సాధన తర్వాత మన దేశ మొదటి ఉపప్రధాని మరియు హోంమంత్రి అయిన సర్దార్ పటేల్, నాటి ప్రధాని శ్రీ నెహ్రూకు ఓ లేఖ రాశారు.
- భారతదేశానికి బెదిరింపులు మరియు చైనాతో రాబోయే యుద్ధాల గురించి ఈ లేఖలో తెలిపారు.
- భారతదేశ రక్షణ దళాలను బలపరిచే అవసరాన్ని సూచించారు.
- సరిహద్దుల వెంట సైనిక స్థానాలను విశ్లేషించడం మరియు పునఃప్రారంభించడాన్ని వివరించారు.
- ఉత్తర మరియు ఈశాన్య సరిహద్దులను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలిపారు.
- సరిహద్దు ప్రాంతాల్లో రవాణా మరియు కమ్యూనికేషన్ ప్రాధాన్యతను ఆవిష్కరించారు.
తర్వాతి కాలంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తే మన పొరుగు వారు 1962లో మనకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. సర్ధార్ తెలిపిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఉంటే, తర్వాతి పరిస్థితి భిన్నంగా ఉండేది. అదే విధంగా పటేల్ లేవనెత్తిన ప్రతి అంశం నేటికీ వర్తిస్తూనే ఉంది.
రైతు కుటుంబం నుంచి వచ్చిన సర్దార్ పటేల్ బ్రిటీష్ వారి దోపిడి మరియు పన్ను విధానాలకు వ్యతిరేకంగా అనేక రైతు ఉద్యమాలను నడిపారనే విషయం మనందరికీ తెలిసిందే. అనేక సమస్యలను ఎదుర్కోవడంలో భాగంగా రైతులు చేసే అలుపెరగని పోరాటమే భారతదేశాన్ని ఏకం చేయడంలో పటేల్ చొరవలో కనిపిస్తుంది. ఆధునిక ఐక్య భారత దేశ రూపశిల్పి ఓ రైతుబిడ్డ కావడం భారతీయులందరికీ గర్వకారణం.
ఇవాళ గుజరాత్ లోని కేవదీయ వద్ద ఈ విగ్రహాన్ని సందర్శించడం ద్వారా నేను పరిపూర్ణత భావాన్ని పొందాను. మనసు మరియు ఆత్మ ఏకమైన ప్రేరణతో పాటు, అంతర్లీనమైన భారతీయుని భావనతో స్ఫూర్తి పొందాను.
ఈ ఐక్యతా ప్రతిమను నిర్మించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఇది భారతీయులంతా ఒక్కటిగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.













