వెంకయ్య భావోద్వేగం : పార్టీతో బంధం తెగిపోయింది
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు నామినేషన్ వేశారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షా వెంటరాగా.. రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తల్లిలాంటి పార్టీతో బంధం తెంచుకోవటం బాధగా ఉందన్నారు. ఏడాదిన్నర వయస్సులోనే తల్లిని కోల్పోయానని.. పార్టీనే తనను ఇంతటి వాడిని చేసిందన్నారు. ఇకపై పార్టీ వ్యవహారాలపై మాట్లాడే అవకాశం ఉండదన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని.. తనకు పెద్ద చరిత్ర ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని కాపాడతానన్నారు. పార్టీలకు అతీతంగా పని చేస్తానన్నారు. ఇష్టపూర్వకంగా పోటీ చేస్తున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 40 సంవత్సరాలు పార్టీతోపాటు ప్రజాజీవితంలో ఉన్నానని.. ఇక నుంచి రాజ్యాంగ నిబంధనలు, ఆదర్శాలకు లోబడే పనిచేస్తానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు వెంకయ్యనాయుడు. ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేసిన మోడీ, అమిత్ షాలకు ధన్యవాదాలు చెప్పారు. మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.













